చిక్కడపల్లి, డిసెంబర్ 5: దేశంలో పాఠశాల విద్య ప్రమాదంలో ఉన్నదని, ఆర్థిక, సామాజిక అసమానతలు లేని విద్యావిధానం కావాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సుందరయ్య కళా నిలయంలో రాష్ట్ర సదస్సును నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 2,3 శాతం నిధులు మాత్రమే కేటాయిస్తున్నారని మండి పడ్డారు. నూతన జాతీయ విద్యావిధానం, ప్రైవేటీకరణ, కాషాయీకరణను ప్రోత్సహిస్తుందన్నారు. విద్యావేత్త ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. 75 ఏండ్లలో ఎన్నడూ లేనంతగా ఉన్నత విద్య నేడు సంక్షోభంలో ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఎఫ్ఐ 17 అఖిల భారత మహాసభల పాటల సీడీ ‘త్యాగపు ఆర్గాన్’ను ఆవిష్కరించారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎల్ మూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో నాయకులు టి.నాగరాజు, ఎం.పూజ, శంకర్, సాయికిరణ్, వీరభద్రం, అశోక్‌రెడ్డి, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.