సిటీబ్యూరో, ఫిబ్రవరి 16(నమస్తే తెలంగాణ): కిడ్నాప్‌లు చేస్తూ.. బెదిరింపులకు దిగుతూ.. పోలీసులకు చిక్కకుండా టెక్నాలజీతో తప్పించుకొని తిరిగిన పాత నేరస్తుడు సూర్యకు సంబంధించి..పలు కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఏడాది పాటు తన కారునే ఇల్లుగా మార్చుకొని.. తెలుగు రాష్ర్టాల్లో సినీ ఫక్కీలో వరుస కిడ్నాప్‌లు చేస్తూ వచ్చాడు. గుడిమల్కాపూర్‌కు చెందిన ప్రశాంత్ అదృశ్యం కావడం.. అతడి కుటుంబసభ్యులు ఆసిఫ్‌నగర్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ ముఠా వ్యవహారం బయటపడింది. నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చే ‘మనీ హీస్ట్’ వెబ్ సిరీస్‌తో ప్రేరేపితమైన భోజాగుట్టకు చెందిన పాతనేరస్తుడు సురేశ్ అలియాస్ సూర్య ముఠాను తయారు చేసి, అందులో సభ్యురాలైన యువతి ద్వారా బాధితులను ట్రాప్ చేస్తూ..కిడ్నాప్‌ల పరంపర కొనసాగించాడు.
బాధితుల వద్ద కాపలా..
గ్యాంగ్‌లీడర్‌తో పాటు సభ్యులు ఎవరూ తమ ముఖాలు కనిపించకుండా ముసుగులతోనే ఉండేవారు. పగటి పూట సభ్యులుండగా, రాత్రి వేళల్లో తన కారులోనే బాధితులను బంధించి.. సూర్య కాపలాగా ఉండేవాడు. తన కారునే ఇల్లుగా మార్చుకొని..ఒక్కోరోజు.. ఒక్కో ప్రాంతంలో బస చేసేవాడు. ఒక ప్రాంతంలో ఎక్కువ సేపు కారు ఆగి ఉందంటే.. పోలీసులు అనుమానిస్తారనే ఉద్దేశంతో కిడ్నాప్ చేసిన బాధతులను కారులో వేసుకొని తిరిగేవాడు. నిద్ర కూడా అందులోనే పోయేవాడు. అన్ని వ్యవహారాలు అందులోంచే నడిపించేవాడు. హాట్‌స్పాట్‌తో ఫోన్ కనెక్ట్ చేసి.. వాట్సాప్ కాల్ మాట్లాడడం, మాట్లాడిన చోట నుంచి మరో చోటకు వెళ్లిపోవడం చేస్తుండేవాడు.
పోలీసులకు ఎవరైనా ఫిర్యాదులు చేస్తే చిక్కకుండా ఉండేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకునేవాడు. ఇందులో భాగంగానే ఆసిఫ్‌నగర్ పోలీసులు కిడ్నాప్ గ్యాంగ్ కోసం గాలిస్తుండగా, ఒక ఏరియాలో కారులో ఉన్నట్లు తేలింది. అప్పటికే పోలీసులు నిందితుడు సూర్య అని గుర్తించారు. దొరుకకుండా పారిపోయే అవకాశాలున్నాయని భావించారు. కారులో నిందితుడు, బాధితుడు ఉన్నట్లు తెలుసుకున్నారు. సూర్య నిద్రలో ఉండగా, కారును చుట్టుముట్టారు. కారుతో పారిపోకుండా.. ఇతర వాహనాలతో రౌండ్ చేసి.. సూర్యను పట్టుకున్నారు.
కాగా, బాధితుల వాట్సాప్ నంబర్‌తోనే మాట్లాడే సూర్య.. డబ్బులు తీసుకోవడంలో కూడా జాగ్రత్తగా వ్యవహరించేవాడు. ముఖాలకు మాస్క్లున్నా ఎక్కడ కూడా బాధిత కుటుంబసభ్యులను ఫేస్ టు ఫేస్ కలిసేవాడు కాదు. ఫలాన చోట డబ్బులు పెట్టి వెళ్లండి.. అనే వాడు.. లేదా బాధితుడి అకౌంట్లో డబ్బులు వేయించి..అతడి ద్వారానే డ్రా చేయించేవాడు.