శేరిలింగంపల్లి, డిసెంబర్ 3 : కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) పథకం కింద ఎస్బీఐ ఫౌండేషన్ ద్వారా క్యాన్సర్ వ్యాధి గ్రస్తులకు అత్యుత్తమ సేవలను అందిస్తున్న స్పర్శ్ హాస్పైస్ సంస్థకు రూ. 3.13 కోట్ల నిధులను సేవల విస్తరణ నిమిత్తం అందిస్తున్నట్లు ఎస్బీఐ ఫౌండేషన్ ఎండీ, సీఈవో సంజయ్ ప్రకాశ్ పేర్కొన్నారు.
ఇప్పటికే రోటరీ క్లబ్ ఆఫ్ బంజారాహిల్స్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిధులను అందిస్తున్న ఫౌండేషన్ 2024 మార్చి వరకు 25 నెలల పాటు ఈ మొత్తాన్ని అందివ్వనున్నామన్నారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఖాజాగూడలో ఉన్న స్పర్శ్ పాలియేటివ్ కేర్ సంస్థలో రూ.12 లక్షల సీఎస్ఆర్ నిధులతో ఎస్బీఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హోమ్ కేర్ వాహనాలను సంజయ్ ప్రకాశ్ శనివారం సంస్థ ఆవరణలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ఫౌండేషన్ రోటరీ క్లబ్ ఆఫ్ బంజారా హిల్స్ చారిటబుల్ ట్రస్ట్ తోడ్పాటుతో స్పర్శ్ సంస్థ సేవల విస్తరణకు తోడుగా నిలుస్తున్నదన్నారు. క్యాన్సర్ సోకి చివరి దశలో ఉన్న బాధితులకు ఈ సంస్థ అందిస్తున్న సేవలు ఎంతో గొప్పవని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ ఫౌండేషన్ సీనియర్ మేనేజర్ రాజరాం చవాన్, ఫౌండేషన్ సమన్వయ కర్త సిద్ధ లింగేశ్ బల్లోల్లి, పాల్గొన్నారు.