మలక్‌పేట, నవంబర్ 23 : సముద్ర తీరప్రాంతాలు, బీచ్‌లలో చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుంటే కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎన్సీసీ దేశ వ్యాప్తంగా ‘పునీత్ సాగర్ అభియాన్’ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా మెస్కో గ్రేడ్స్ స్కూల్ ఎన్సీసీ వింగ్ ట్రూప్ నంబర్ 37, యూనిట్-2 తెలంగాణ బెటాలియన్ ఎస్సీసీ సికింద్రాబాద్ కూడా పునీత్ సాగర్ అభియాన్ యాత్రను నిర్వహించింది. అందులో భాగంగా బుధవారం మలక్‌పేటలోని మూసీ పరీవాహక ప్రాంతాల్లో మెస్కో గ్రేడ్స్ స్కూల్ ఎస్సీసీ వింగ్‌కు చెందిన ఎన్సీసీ క్యాడెట్లు చెత్తాచెదారంతోపాటు ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి మూసీ పరిసరాలను శుభ్ర పరిచారు. స్థానికులకు తీరప్రాంతాలు, బీచ్‌లను శుభ్రంగా ఉంచుకోవటంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎన్సీసీ అధికారి హరిదేవ్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వ్యర్థాలతో సముద్ర తీరప్రాంతాలు కాలుష్య కాసారంగా మారుతున్నాయని చెప్పారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో జలచరాలకు హాని కలుగటంతోపాటు పర్యావరణ సమతుల్యత, భూసారం దెబ్బతింటుందని వివరించారు. పర్యావరణ పరిరక్షణకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.