మెహిదీపట్నం, నవంబర్ 22 : ప్రభుత్వ పథకాలను అర్హులకు అందించడానికి అధికారులు కృషి చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఆసరా పింఛన్ కార్డులను అందించింది. నాంపల్లి నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ఇప్పటికే పంపణీ పూర్తి చేసిన అధికారులు పాత పింఛన్ దారులకు కూడా కొత్త కార్డులను అందించే పని చేపట్టారు. ఆసిఫ్‌నగర్ తహసీల్దార్ కార్యాలయం పరిధిలోకి వచ్చే నాంపల్లి, కార్వాన్ నియోజకవర్గాల్లో పాత పింఛన్ దారులను గుర్తించిన అధికారులు వారికి ఆసరా కార్డులను రూపొందించారు. ఆయా డివిజన్లలో పాత కార్డుల స్థానంలో కొత్తవి అందించే బాధ్యతను కార్పొరేటర్ల సహకారంతో తహసీల్దార్ షేక్ఫర్హిన్, కార్యాలయ సిబ్బంది చేపట్టారు.
వార్డుల వారీగా 16 కౌంటర్లలో కార్డుల పంపిణీ..
నాంపల్లి, కార్వాన్ నియోజకవర్గాల్లోని డివిజన్లలో వార్డుల వారీగా కౌంటర్లను ఏర్పాటు చేసి కార్డులను అందించడానికి అధికారులు సన్నాహాలు చేశారు. ఆసిఫ్‌నగర్ తహసీల్దార్ అధికారులు పాత కార్డులను ఆధునీకరించి కొత్త కార్డులను ఇస్తుండటంపై కార్పొరేటర్లు, పింఛన్ దారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయంలో కొత్తగా ముద్రించిన కార్డులను కార్పొరేటర్లకు మంగళవారం తహసీల్దార్ అందజేశారు. అర్హులకు పథకాలను అందించడానికి కృషి చేస్తున్నామన్నారు. నాంపల్లి నియోజకవర్గంలో 12 కౌంటర్లు, కార్వాన్ నియోజకవర్గంలో 4 కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.