సిటీబ్యూరో, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): మెరుపు వేగంతో దూసుకు వెళ్లే రేసింగ్ కార్లను చేసేందుకు నగర వాసులు ఆసక్తి చూపించారు. నగరం నడిబొడ్డున.., హుస్సేన్‌సాగర్ తీరంలో నిర్మించిన 2.8 కి.మీ కార్ రేసింగ్ ట్రాక్ చుట్టూ ఎక్కడ చూసినా రేసింగ్ వీక్షించేందుకు వచ్చే వారే కనిపించారు. రేసింగ్ చివరి రోజు పోటీ కావడంతో పాటు ఆదివారం కలిసి రావడంతో నగర వాసులంతా వీకెండ్‌ను కార్ల రేసింగ్‌ను చూసేందుకు ఎగబడ్డారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎదురుగా తెలుగుతల్లిఫ్లై ఓవర్ మొదలుకొని ఎన్టీఆర్ ఘాట్, ఎన్టీఆర్ గార్డెన్, ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్ రోడ్డు, ఐమ్యాక్స్, నెక్లెస్ రోడ్డు ఇందిరాగాంధీ రోటరీ ఇలా రేసింగ్ ట్రాక్ చుట్టూ చేరిన నగర వాసులు రయ్.. రయ్.. మంటూ వచ్చే కార్ల రేసింగ్‌ను ఎంతో ఆసక్తిగా వీక్షించారు.
అంతర్జాతీయ పోటీల్లో ఒకటైన (ఫార్ములా 4 మోడల్ రేసింగ్) ఇండియన్ రేసింగ్ లీగ్‌ను మొట్ట మొదటిసారిగా హైదరాబాద్‌లో నిర్వహించారు. సాయంత్రం చీకటి పడటంతో ఎలాంటి రేస్‌లు నిర్వహించేందుకు అవకాశం లేకుండా పోయింది. లీగ్ నిర్వహణకు 2 రోజులు మాత్రమే అనుమతి ఉండడం, క్వాలిఫయింగ్ రౌండ్లో ఆలస్యం కారణంగా రెండో రోజు రేసింగ్ పూర్తి స్థాయిలో నిర్వహించలేకపోయారు.
రేసింగ్‌లో స్వల్ప ప్రమాదాలు
రెండో రోజు రేసింగ్ లీగ్‌లో మధ్యాహ్నం స్వల్ప ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ప్రమాదంలో ఓ మహిళా రేసర్తో పాటు మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం తిరిగి పోటీలను కొనసాగించారు. చెన్నై టర్బో రైడర్స్ మహిళా రేసర్‌కు గాయాలైనట్లు నిర్వాహకులు తెలిపారు. క్వాలిఫైయింగ్ రేసులో గోవా ఏసెస్ రేసింగ్ కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం కారణంగా రేసింగ్ ఆలస్యమైందని, రేసింగ్‌లో ఇలాంటివి సహజమేనని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా లైటింగ్ తగ్గడంతో రేసింగ్ లీగ్‌ను పూర్తి చేయకుండానే ముగించారు.
ప్రత్యేక ఆకర్షణగా జేకే టైర్స్ కార్ల విన్యాసాలు
ఇండియన్ రేసింగ్ లీగ్‌లో జేకే టైర్స్ కార్ల విన్యాసాలు ఆదివారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జేకే టైర్స్‌కు చెందిన మూడు ట్రాక్‌పైకి వచ్చి రెండు టైర్లు గాల్లో ఉండగా, మరో రెండు టైర్ల మీదనే పరుగులు పెట్టాయి. ఐమ్యాక్స్ ముందు నుంచి వీఐపీ గ్యాలరీ వరకు ఉన్న ట్రాక్‌పై మధ్యాహ్నం భోజన సమయంలో కార్లతో విన్యాసాలు చేశారు. రెండు టైర్లతో కదులుతున్న కార్లలో మహిళలు జెండాలు ఊపుతూ అభివాదం చేశారు. దీన్ని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా తిలకించారు.
వీఐపీల తాకిడి..
కార్ రేసింగ్‌ను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో వీఐపీలు తరలివచ్చారు. సాధారణ ప్రేక్షకుల కోసం ట్రాక్ బయటి వైపు గ్యాలరీలను ఏర్పాటు చేస్తే వీఐపీల కోసం ఐమ్యాక్ పక్కన ఉన్న పాత డాక్టర్ కార్స్ స్థలంలో ‘ఎల్’ ఆకారంలో భారీ విస్తీర్ణంలో గ్యాలరీని ఏర్పాటు చేశారు. పరిమితికి మించి వీఐపీలు తమ కుటుంబ సభ్యులతో కలిసి రావడంతో వీఐపీ గ్యాలరీల్లో స్థలం లేకుండా పోయింది. దీనికి తోడు రేసింగ్ జరిగే గంట సమయం పాటు వీఐపీలంతా లోపలికి వెళ్లేందుకు అనుమతి లేకపోవడంతో వీఐపీ ప్రధాన ద్వారం నుంచే కార్ రేసింగ్‌ను వీక్షించారు.
మళ్లీ డిసెంబర్లో..
ఇండియన్ రేసింగ్ లీగ్‌ను దేశంలోని చెన్నై, హైదరాబాద్ మహానగరాల్లో నిర్వహిస్తున్నారు. మొత్తం 6 జట్లు పాల్గొంటున్న ఈ పోటీల్లో హైదరాబాద్‌లో 19, 20 తేదీల్లో తొలి లీగ్ నిర్వహించారు. తర్వాత చెన్నైలో నవంబర్ 25, 27 తేదీల్లో, డిసెంబర్ 2, 4 తేదీల్లో నిర్వహించనున్నారు. డిసెంబర్ 10, 11 తేదీల్లో హైదరాబాద్‌లో తుది పోటీలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. దేశంలోని 6 నగరాలకు చెందిన జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న
అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత కలిగిన ఫార్ములా -ఈ రేసింగ్ హైదరాబాద్‌లో ఇదే ట్రాక్‌పై వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న జరుగనున్నది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుమారు 12 దేశాల్లోని ప్రధాన నగరాల్లో ఫార్ములా-ఈ కార్ రేసింగ్ పోటీలు జరుగుతుండగా, అందులో భారతదేశంలోనే మొట్ట మొదటి సారిగా హైదరాబాద్‌లో ఈ పోటీలను నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగానే హుస్సేన్‌సాగర్ తీరంలో 2.8 కి.మీ మేర ఫార్ములా-ఈ కార్ రేసింగ్ కోసం ట్రాక్‌ను నిర్మించారు. ఇదే ట్రాక్‌పై ట్రయల్స్‌గా ఇండియన్ రేసింగ్ లీగ్‌ను నిర్వహిస్తూ, ట్రాక్ ప్రమాణాలను పరీక్షిస్తున్నారు.