సిటీబ్యూరో, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): చారిత్రక బన్సీలాల్‌పేట మెట్ల బావి పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. చెత్తా చెదారంతో మూసుకుపోయి, నిరుపయోగంగా ఉన్న ఈ మెట్ల బావిని పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బావిలో 57 అడుగుల లోతు నుంచి సుమారు 500 టన్నులకు పైగా వ్యర్థ్ధాలను వెలికితీసింది. సాహే అనే ఎన్జీవోతో కలిసి హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ శాఖలు అభివృద్ధి చేశారు. చిన్న, చిన్న వేడుకల కోసం సీటింగ్‌తో కూడిన గార్డెన్, అంపి థియేటర్ నిర్మాణం చేసి అద్భుతమైన పర్యాటక క్షేత్రంగా మలిచింది. వరల్డ్ హెరిటేజ్ వీక్‌లో భాగంగా బన్సీలాల్‌పేట మెట్ల బావి పునరుద్ధరణ, సుందరీకరణపై పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ ఆదివారం ట్వీట్ చేశారు. పురాతన కట్టడాల పరిరక్షణ, బావుల పునరుద్ధరణలో బన్సీలాల్‌పేట మెట్ల బావి ట్రెండ్ సెట్టర్‌గా నిలవనుందని పేర్కొన్నారు. కాగా ఈ మెట్ల బావిని ఈ నెలాఖరులోగా అందుబాటులోకి తీసుకువచ్చేలా ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు.