సిటీబ్యూరో, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): నగరవాసులను రెండు రోజులపాటు అలరించిన ఫార్ములా రేసింగ్ ట్రాక్‌పై నగర ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. ఎన్టీఆర్ గార్డెన్ నుంచి సచివాలయం, మింట్ కంపౌండ్ వయా ఐమాక్స్, ఎన్టీఆర్ గార్డెన్ వరకు 2.8 కిలోమీటర్ల మేర ఫార్ములా కార్ రేసింగ్‌కు ప్రత్యేక ట్రాక్ నిర్మించారు. ఆదివారంతో కార్ రేసింగ్ లీగ్ ముగియడంతో సోమవారం నుంచి ఈ రహదారులన్నీ తెరుచుకోనున్నాయి. అయితే ఫార్ములా రేసింగ్ కోసం నిర్మించిన ఈ ట్రాక్‌పై నగరంలోని యువత రేసింగ్‌లు, విన్యాసాలకు పాల్పడే అవకాశం ఉందని పోలీసులు గ్రహించారు. ఇప్పటికే సాధారణ రోడ్లపైనే దూసుకుపోతూ ప్రమాదాలకు కారణమవుతున్న వారు ఈ ట్రాక్‌ను రాత్రి సమయాల్లో, వీకెండ్స్‌లో హాట్‌స్పాట్‌గా మార్చుకునే అవకాశమున్నందున ట్రాక్‌పై ప్రత్యేక నిఘా పెట్టనున్నట్లు నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు.
సీసీ కెమెరాలతో నిఘా
ఫార్ములా రేసింగ్ కోసం ఏర్పాటు చేసిన 2.8 కిలోమీటర్ల ట్రాక్‌పై ఇప్పటికే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిని అలాగే కొనసాగిస్తూ ఈ ట్రాక్‌పై గట్టి నిఘా పెట్టనున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఎవరైనా ఈ ట్రాక్‌పై మితిమీరిన వేగంతో ప్రయాణించినా, రేసింగ్‌కు పాల్పడినా వారిని గుర్తించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకునేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు.
చాలా ధైర్యం అవసరం
రేసింగ్ ఎంజాయ్ చేశాం. పోటీలపై పెద్దగా అవగాహన లేదు. ఎవరు గెలుస్తారనే దానిపై మాకు ఆసక్తి లేదు. కానీ కార్లు వేగంగా వెళుతుంటే వాటిని చూసి చాలా హ్యాపీ అనిపించింది. ఒకదాని తర్వాత ఒకటి దూసుకుపోతున్నాయి. చాలా టెన్షన్ అనిపించింది. అంత స్పీడ్‌తో ఢీకొడితే పెద్ద ప్రమాదం జరుగుతుంది. వాటిని నడపడానికి చాలా దైర్యం కావాలి. నిజంగా రేసర్స్ అందరికీ హ్యాట్సాఫ్. హైదరాబాద్‌లో ఈ వేడుకలు చూడటం సంతోషంగా ఉంది.
– ప్రజ్ఞ, సందర్శకురాలు
మహిళా రేసర్స్ కూడా ఉన్నారు
రేసింగ్ అంటే ఎప్పుడూ టీవీల్లోనే చూశాం. నేరుగా చూడలేదు. కానీ హైదరాబాద్ వేదికగా జరిగిన రేసింగ్ పోటీలను ప్రత్యక్షంగా చూస్తూ ఎంజాయ్ చేశాం. మా స్నేహితులమంతా సందడిగా గడిపాం. నిజంగా మాకు కూడా రేసింగ్ అంటే ఆసక్తి కలిగింది. నేర్చుకోవాలనుకుంటున్నాం. మహిళా రేసర్స్ కూడా ఉన్నారు. వారు నిజంగా గ్రేట్. ఇలాంటి సాహసోపేత రేసింగ్‌లో దూసుకుపోవడం గొప్ప విషయం.
– చైతన్య, హైదరాబాద్
ఏర్పాట్లు బాగా చేశారు.!
హైదరాబాద్‌లో రేసింగ్ పోటీలు చూడటం చాలా ఆనందంగా ఉంది. రేసింగ్ కార్లను వీడియోలు తీశాం. వీడియో కాల్స్ చేసి ఇంట్లో వాళ్లకి చూపించాం. ఏర్పాట్లు బాగా చేశారు. అయితే రేస్ ప్రారంభం కావడంతో బయటనే అరగంటకు పైగా ఉండాల్సి వచ్చింది. రేసింగ్ పూర్తయ్యాక ట్రాక్ ఫ్రీ కాగానే లోపలికి అనుమతించారు. నిర్వాహకులను తప్పుపట్టాల్సిన అవసరం లేదు. లీగ్ రద్దవడం కొంత నిరుత్సాహం కలిగించినా.. రేసింగ్ మాత్రం ఎంజాయ్ చేశాం.
– నీతు, సందర్శకురాలు
కఠిన చర్యలు తీసుకుంటాం
నగర రోడ్లపై రేసింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. రోడ్లపై వాహనాలతో విన్యాసాలు చేయడం, రేసింగ్‌లకు పాల్పడడం వల్ల ప్రమాదాలు జరుగుతాయి. దీని వల్ల సాధారణ ప్రజలతో పాటు రేసింగ్‌లు, విన్యాసాలకు పాల్పడే వారు సైతం గాయాలకు గురవడం, కొన్ని సందర్భాల్లో ప్రాణ నష్టం ఏర్పడే అవకాశాలు లేకపోలేదు. నగరంలో రోడ్లు ప్రయాణాలు చేసేందుకు వీలుగా నిర్మించినవనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎన్టీఆర్ గార్డెన్ చుట్టూ ఏర్పాటు చేసిన రేసింగ్ ట్రాక్‌పై రేసింగ్‌లు, విన్యాసాలకు పాల్పడితే వారి డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు చేయడంతో పాటు చట్టరీత్య కఠిన చర్యలు తీసుకుంటాం.
– రంగనాథ్, నగర ట్రాఫిక్ జాయింట్ కమిషనర్