సిటీబ్యూరో, నవంబర్ 20(నమస్తే తెలంగాణ): వాతావరణంలో నానాటికి పెరుగుతున్న పీఎం 2.5 సూక్ష్మ ధూళికణాలను పక్కాగా లెక్కించేందుకు కాలుష్య నియంత్రణ మండలి చర్యలు చేపట్టింది. ఈమేరకు తెలంగాణలోని ఏడు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా వాహనాల రద్దీ, పారిశ్రామిక కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఆధునిక పీఎం 2.5 శాంపిలర్స్ను ఏర్పాటు చేసి, రోజువారీ కాలుష్య తీవ్రతను లెక్కిస్తున్నారు. తెలంగాణలోని ఫేజ్-2 నగరాల్లోనూ వీటిని ఏర్పాటు చేయనున్నారు.
మరో 15 రోజుల్లో..
పర్యావరణ కాలుష్యంలో పీఎం 2.5 వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. కేవలం వాహనాల రాకపోకలతోపాటు పరిశ్రమలు వెదజల్లే పొగలో పీఎం2.5 పరిమాణం క్రమంగా పెరుగుతున్నది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న జోనల్ పీసీబీ ప్రాంతాల్లో సాధారణ కాలుష్య కారకాలే లెక్కిస్తుండగా.. పీఎం2.5, పీఎం10 గణాంకాలు పరిమితంగానే నమోదు చేస్తున్నారు. సీపీసీబీ సూచనల కంటే క్రమంలో పీఎం 2.5, పీఎం10 పరిమాణం పెరుగుతుండటంతో ఆధునిక పరికరాలను ప్రధాన సెంటర్లలో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియను ముగించగా.. మరో 15 రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి.
పీఎం2.5తో ఇబ్బందులు
గాలిలో పరిమితికి మించి పీఎం 2.5 చేరితే వృద్ధులు, చిన్నారులకు శ్వాసకోశ ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన నగరాల్లో అడ్వాన్స్ యంత్రాలను ఏర్పాటు చేయడం వలన డేటా విశ్లేషణ, నిర్వహణ సులభంగా చేయడానికి అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. వీటిని సెంట్రల్ సర్వర్లకు అనుసంధానం చేసే వీలు ఉండటంతో… ఆన్లైన్లోనే పీఎం 2.5 లెక్కింపు చూసుకునే వీలు దొరుకుతుంది. సెన్సిటివ్ సెన్సార్ల సాయంతో పనిచేసే ఈ పరికరాలతో పీఎం 2.5 లెక్కింపు కూడా సులభంగా చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఆధునిక పరికరాలతో లెక్కింపు…
సాధారణ పీఎం2.5 శాంపిలర్స్తో సేకరణ, డేటా విశ్లేషణ, ఆప్ లోడింగ్‌లో కొంత జాప్యం జరుగుతున్నది. ఈ క్రమంలో వేగంగా శాంపిల్ సేకరించడంతోపాటు, డేటా స్టోరేజీ ఎక్కువ ఉండేలా, బ్యాకప్ ఫెసిలిటీ ఉండే పీఎం 2.5 శాంపిలర్స్ను కొత్తగా ఏర్పాటు చేయనున్నారు. వీటితో ఆటోమేటిగ్గానే డేటా నమోదు చేయడంతోపాటు, వీక్లీ, మంత్లీ వారీగా సగటు లెక్కింపు కూడా సిస్టంలో రూపొందించిన సాఫ్ట్వేర్ సాయంతో జరిగిపోనున్నది. ప్రస్తుతం నగరంలో ఉన్న పీఎం2.5 యంత్రాల కంటే కొత్తగా కొనుగోలు చేసేవి ఖరీదైనవి కాగా, పనితీరు కూడా వేగంగానే ఉంటుందని పీసీబీ అధికారులు చెబుతున్నారు. వీటిని ఆర్సీపురం జోనల్ ల్యాబొరెటరీలో రెండు, వరంగల్ జోనల్ ల్యాబొరెటరీలో 2, కొత్తగూడెం రీజనల్ సెంటర్లో 2, నల్గొండ పరిధిలో ఒక యంత్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. మొత్తం ఏడు యంత్రాలకు దాదాపు 20 లక్షల చొప్పున ఖర్చు చేయనున్నట్లుగా తెలిసింది.