పీర్జాదిగూడ, నవంబర్ 20: ఇంటి అనుమతుల జారీలో టీఎస్ బీపాస్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో సత్ఫలితాలనిస్తున్నాయి. గతంలో బ్రోకర్ల దగ్గర నుంచి సంబంధిత అధికారుల చుట్టూ తిరిగితే తప్పా ఇంటి అనుమతులు వచ్చేవికావు. కానీ, నేడు ప్రజల ఇబ్బందులు తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ బీపాస్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసిన వెంటనే సింగిల్ స్టెప్‌లో నిర్మాణదారులకు ఇన్స్టాంట్ పద్దతిలో ఇంటి అనుమతులు ప్రభుత్వం జారీ చేయడ వల్ల ప్రజల నుంచి మంచి స్పందన కనబడుతుంది. ప్రభు త్వం ప్రవేశ పెట్టిన టీఎస్ బీపాస్‌ను పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో అధికారులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఇందుకుగాను కార్పొరేషన్లో దరఖాస్తు మొదలుకొని అనుమతులను పొందే వరకు మొత్తం పక్రియ ఆన్లైన్లో అత్యంత పారదర్శకంగా ఇంటి అనుమతులు మంజూరు అవుతున్నాయి.
రోజుల వ్యవధిలోనే అనుమతులు..
టీఎస్ బీపాస్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పీర్జాదిగూడ కార్పొరేషన్లో 2,916 ఆన్లైన్లో దరఖాస్తులు రాగా వీటిలో 2,426 దరఖాస్తు దారులకు ఇంటి అనుమతులు జారీ చేశామని అధికారులు పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా రోజుల వ్యవధిలోనే దరఖాస్తులపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ టీం క్షేత్రస్థాయిలో విచారణ చేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం టౌన్ ప్లానింగ్ అధికారులు అప్రూవ్ చేస్తున్నారు. ఈ విధానం ప్రవేశపెట్టడంతో టౌన్ ప్లానింగ్ విభాగంలో దళారుల బెడదతో పాటు అవినీతి తగ్గిందని పలువురు పేర్కొంటున్నారు. గడిచిన మూడు సంవత్సరాల్లో కార్పొరేషన్‌కు రూ.33.35 కోట్లు ఆదాయం సమకూరిందని అధికారులు వెల్లడించారు.
పేద, మద్య తరగతి ప్రజలకు మేలు
పేద ప్రజలకు అందుబాటులో ఉం డేవిధంగా ఇంటి అనుమతులు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో స్థానిక మేయర్ వెంకట్‌రెడ్డి అభ్యర్థన మేరకు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ 2022 అక్టోబర్ 26వ తేదీన 75 గజల్లోపు స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టే వారికి టీఎస్ బీపాస్ ద్వారా కేవలం రూ.1కే ఇంటి అనుమతులు జారీ చేయాలని అధికారులను ఆదేశించడంతో ప్రభుత్వం ప్రత్యేకంగా సర్క్యులర్ జారీ చేసిందని అధికారులు వెల్లడించారు. ఈ నిర్ణయంతో పేద, మద్య తరగతి ప్రజలకు మేలు జరగడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
విప్లవాత్మక మార్పులు..
టీఎస్ బీపాస్ ద్వారా ప్రజలకు పారదర్శకమైన సేవలు అందడంతోపాటు వెనువెంటనే ఇన్‌స్టాంట్‌గా ఇంటి అనుమతులు జారీ చేస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ పేద, మద్య తరగతి ప్రజల ఇబ్బందలను గుర్తించి ఇంటి నిర్మాణ అనుమతుల జారీ విషయంలో తీసుకువచ్చిన సంస్కరణల ఫలితంగా టౌన్ ప్లానింగ్ విభాగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. టీఎస్ బీపాస్ సేవలు పూర్తిగా ఆన్లైన్లో పారదర్శకంగా పొందవచ్చు.
– జక్క వెంకట్‌రెడ్డి, మేయర్,పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్