మేడ్చల్, నవంబర్ 20: సామాజిక మాధ్యమాలు, ఓటీటీ వేదికలు ఔత్సాహిక యువత ప్రతిభను ప్రదర్శించే వేదికలుగా ఉపయోగపడుతాయని ‘మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల’ ప్రిన్సిపాల్ డాక్టర్ రామస్వామి రెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని కళాశాలలో స్టూడెంట్ అసోసియేషన్ కౌన్సిల్లో భాగమైన ఫొటోగ్రఫీ క్లబ్, అభినయ క్లబ్‌ల ఆధ్వర్యంలో ‘ఇన్ఫోకస్’పేరుతో అంతర్ కళాశాలల ఛాయగ్రహణ, లఘు చిత్రాల పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వేగంగా మార్పులు చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానం లఘు చిత్ర నిర్మాణంలో నూతన ఒరవడులకు అవకాశాలు కల్పిస్తుందన్నారు. ఔత్సాహికులు తమ సృజన్మాకతను ఆకాశమే హద్దుగా ప్రదర్శిస్తున్నారని తెలిపారు. సామాజిక మాధ్యమాలు, ఓటీటీలు ఇందుకు ఉపయోగపడుతున్నాయన్నారు. లఘు చిత్రాలతో ప్రతిభ చాటుకుని ఎంతో మంది నటీనటులు, దర్శకులుగా వెండి తెరపై అవకాశాలు సంపాదించుకున్నారన్నారు. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రజ్ఞను అన్వేషించే సంకల్పంతో ఇన్ఫోకస్ పోటీలు నిర్వహించామన్నారు. ఛాయచిత్ర విభాగంలో 270 మంది విద్యార్థులు, లఘు చిత్ర విభాగంలో 20 విద్యార్థి బృందాలు వివిధ కళాశాలల నుంచి పాల్గొన్నాయన్నారు. కార్యక్రమ నిర్వహణకు ఆర్థిక సాయం అందజేసిన ‘ప్లాట్‌ఫాం 65’ నిర్వాహక సంచాలకుడు సద్గుణ్పాతకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయ నిర్ణేతలుగా ప్రముఖ తెలుగు ఛాయా గ్రాహకులు నూకా రమేశ్, నవతరం నటుడు సంజయ్ వ్యవహరించారు. ఛాయ చిత్ర విభాగంలో గీత విశ్వవిద్యాలయం విద్యార్థిని కుమారి హిమ, మల్లారెడ్డి కళాశాల విద్యార్థి రాకేశ్ ప్రథమ, ద్వితీయ బహుమతులను సొంతం చేసుకున్నారు. లఘు చిత్ర విభాగంలో మల్లారెడ్డి విద్యార్థులు సుజిత్, సత్యజి త్ ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు. అధ్యాపక విభాగంలో వంశీకృష్ణను విజేతగా నిలిచారు. కార్యక్రమంలో కో ఆర్డినేటర్లు హర్షద, కుమారి హేమలత, రాయల వెంకట్ పాల్గొన్నారు.