కేపీహెచ్‌బీ కాలనీ, నవంబర్ 14 : కూకట్పల్లి మండలంలోని కాముని చెరువు కబ్జాపై మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్లో ఫిర్యాదు అందగా వెంటనే స్పందించి కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.. బాలాజీనగర్ డివిజన్ కాముని చెరువులో కొందరు వ్యక్తులు మట్టి పోస్తూ చెరువును ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని ఓ వ్యక్తి మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్లో ఫొటోలతో ఫిర్యాదు చేశా డు. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ చెరువు కబ్జాపై చర్యలు తీసుకోవాలని కూకట్పల్లి జోనల్ అధికారులు, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్పందించిన అధికారులు క్షేత్రస్థాయిలో చెరువును పరిశీలించి చర్యలు చేపట్టారు. ఈ చెరువు కబ్జా విషయంపై గత వారం రోజుల క్రితమే రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి కబ్జాకు కారకులైన వ్యక్తులపై కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో సుభాష్‌చంద్రబోస్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. చెరువులో ఆక్రమణలను కూల్చివేసి.. పెన్సింగ్ పనులను ప్రారంభించారు. ట్విట్టర్లో ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్‌కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
నాడు 40 ఎకరాలు.. నేడు 20 ఎకరాలే..!
కూకట్పల్లి మండలంలోని మూసాపేట, కూకట్పల్లి గ్రామాల సరిహద్దులో సర్వే నం.80, 908లలో సుమారు 40 ఎకరాల 39 గుంటల స్థలంలో కాముని చెరువు ఉంది. కొన్నేళ్ల కిందట ఈ చెరువును ఆనుకొని రాఘవేంద్ర కాలనీ వీకర్ సెక్షన్ పేరుతో కాలనీ వెలిసింది. క్రమంగా చెరువు స్థలం ఆక్రమణకు గురికాగా ప్రస్తుతం సుమారు 20 ఎకరాల వరకు మిగిలింది. అయితే ఉన్న చెరువు సుందరీకరణ కోసం సీఎస్ఆర్లో భాగంగా ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ అభివృద్ధి చేసేందుకు ముందుకు రాగా.. కోర్టు కేసులతో ఈ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. చెరువులో ఆక్రమణలను అరికట్టే దిశగా పెన్షింగ్ పనుల కోసం గత 6 నెలల కిందట రూ.40 లక్షల నిధులను కేటాయించారు. పనులు ప్రారంభం కాలేదు.
సొసైటీ పేరుతో ఆక్రమణలు
ఇదే అదునుగా కొందరు వ్యక్తులు సొసైటీ పేరుతో ఆక్రమణలకు తెరతీశారు. నీటిపారుదల, రెవెన్యూ శాఖ అధికారులను మచ్చిక చేసుకొని చెరువులో గత 5-6 నెలలుగా మట్టి పోస్తూ చెరువును పూడుస్తూ వస్తున్నారు. ఇలా చెరువులో 200 మీటర్ల దూరం, 30 మీటర్ల వెడల్పుతో మట్టిని నింపినా అధికారులు పట్టించుకోలేదు. స్థానికంగా ఓ వ్యక్తి జోనల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతో స్పందించిన అధికార యంత్రాంగం మట్టి పోస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకొని, కబ్జా చేస్తున్న సుభాష్ చంద్రబోస్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. రెండు రోజులుగా అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన అధికారులు ఫెన్సింగ్ పనులు చేపట్టారు. మట్టిని తొలగిస్తామని, అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ట్విట్టర్ ద్వారా ఈ విషయం వెలుగులోకి రావడంతో అధికారులు మరోసారి అప్రమత్తమై చర్యలను ముమ్మరం చేశారు.
జడ్సీ మమతకు అభినందనలు
కూకట్పల్లి సర్కిల్లో చెరువు ఆక్రమణ ఫిర్యాదుపై వెంటనే స్పందించి చర్యలు తీసుకున్న కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమతను మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో అభినందించారు. ఈ చెరువు ఆక్రమణలపై ఫిర్యాదు అందిన వెంటనే రెవెన్యూ, ఇరిగేషన్ విభాగం అధికారులకు సమాచారం అందించి.. వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించి, కజ్జా చేస్తున్న వ్యక్తులపై కేసు నమోదు చేయించడంపై జడ్సీని మంత్రి కేటీఆర్ అభినందించారు.