సిటీబ్యూరో, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే విధంగా ఉన్న ఆక్రమణలపై జీహెచ్ఎంసీతో కలిసి నగర ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపించనున్నారు. ప్రస్తుతం రోప్ (రిమూవల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ పార్కింగ్ ఎంక్రోచ్మెంట్స్)తో ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు చర్యలు తీసుకుంటాన్నారు. ఆదేవిధంగా 4 ఈ విధానాన్ని (ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషన్, ఇంజినీరింగ్, ఎస్టాబ్లిష్మెంట్) కూడా అమలు చేస్తున్నారు. నగరంలో వాహనాల సంఖ్య భారీగా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా.. నగరంలో ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు పోలీసులు సంబంధిత అన్ని ప్రభుత్వ శాఖలతో కలిసి చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రోడ్లను బ్లాక్ చేస్తూ వాహనాల పార్కింగ్, ఇష్టాను సారంగా ఫుట్‌పాత్‌ల ఆక్రమణలకు పాల్పడుతున్న వారిని గుర్తించి 11,236 మందికి నోటీసులు జారీ చేశారు. నేరతీవ్రతను బట్టి 543 మందిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయించారు. వాహనదారుల ఉల్లంఘనలపై పోలీసులు వీడియో తీస్తున్నారు. స్పందించని వారిపై చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు.
మూసేసిన రోడ్డు తెరిచారు..
గోషామహల్ ప్రాంతంలో ఒక రోడ్డును 15 ఏండ్ల కిందట తమ వ్యాపార అవసరాల నిమిత్తం మూసేశారు. ఇక్కడి నుంచి సామాన్య ప్రజలు రాకపోకలు సాగించేందుకు వీలు లేకుండా చేశారు. ఆయా వ్యాపార సంస్థలకు అనుకూలంగా రోడ్డును మార్చుకున్నారు. దీనిపై ఎవరైనా మాట్లాడితే బెదిరింపులకు పాల్పడుతున్నారు. రోప్ అమలులో భాగంగా ట్రాఫిక్ ఇబ్బందులపై క్షేత్ర స్థాయిలో ట్రాఫిక్ పోలీసులు సర్వేలు చేశారు. గోషామహల్లో వ్యాపారులు మూసేసిన రోడ్డు వ్యవహారం బయటపడింది. ట్రాఫిక్ పోలీసులు రోడ్డును తెరవడంతో స్థానిక ప్రజలు సాఫీగా రాకపోకలు సాగిస్తున్నారు.
జీహెచ్ఎంసీతో సమన్వయం
ప్రధాన కూడళ్లు, ప్రధాన రోడ్లపై ట్రాఫిక్‌కు అడ్డంకిగా ఉండే అక్రమ కట్టడాలు, పార్కింగ్ ఏరియాలను సర్వే చేసి ఒక నివేదికను ట్రాఫిక్ పోలీసులు రూపొందిస్తున్నారు. ఈ నివేదిక ఆధారంగా జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ల వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు. 2016లో పార్కింగ్ నిబంధనలపై ప్రభుత్వం జారీ చేసిన జీవోకు విరుద్ధంగా పార్కింగ్ చేసే వారిపై చర్యలు తీసుకుంటారు. రెండు మూడు రోజుల్లోనే జీహెచ్ఎంసీతో సమావేశమై రహదారులపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే వాటిపై తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకుంటారు.