సిటీబ్యూరో, నవంబర్ 14(నమస్తే తెలంగాణ): మేఘాలయ కేంద్రంగా నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠా గుట్టును సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు. ఆరుగురు సభ్యులు ఉన్న ఈ ముఠాలో నుంచి ఇద్దరిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర కథనం ప్రకారం… విశాఖపట్నంకు చెందిన షేక్ ఖాజా నయాబ్ రసూల్ నాలుగు నెలల కిందట నగరానికి వచ్చి, మియాపూర్‌లో ఉంటున్నాడు. తాను ఏదైనా డిగ్రీ చేయాలని భావిస్తున్నట్లు చైతన్యపురి నివాసి ప్రేమ్‌కుమార్(29)తో చెప్పాడు. ప్రేమ్‌కుమార్ సికింద్రాబాద్‌కు చెందిన గరికపాటి వెంకట భాస్కర సత్యనారాయణ శర్మ అలియాస్ శర్మ(49)ను పరిచయం చేశాడు. వన్ సిట్టింగ్ ద్వారా డిగ్రీ పట్టా ఇప్పిస్తానని శర్మ చెప్పాడు. ఇది నమ్మిన షేక్‌ఖాజా కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న శర్మను సంప్రదించి.. తాను దూరవిద్య ద్వారా బీఎస్సీ(ఐటీ) కోర్సు చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. మేఘాలయలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో పనిచేసే అఖిలేశ్, ప్రవీణ్ తనకు తెలుసునని, వారు ఆన్లైన్ ద్వారా పరీక్షలు రాయిస్తారని శర్మ చెప్పాడు. షేక్‌ఖాజా అంగీకరించడంతో పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, ఇంటర్ మెమో, ఐడీ ప్రూఫ్ తదితర పత్రాలతో పాటు రూ.2.10 లక్షలు ఫీజు కట్టాల్సి ఉంటుందని అతడికి ప్రేమ్ వివరించాడు. దీంతో పత్రాలను అందజేసిన షేక్ ఖాజా.. రూ.2,07,000లు ఫోన్‌పే ద్వారా ప్రేమ్‌కుమార్‌కు పంపించాడు.
పరీక్షలు రాయకుండానే..
కొన్ని రోజుల తర్వాత ప్రేమ్ కుమార్ 2014- 2016 విద్యా సంవత్సరానికి సంబంధించిన డిగ్రీ సర్టిఫికెట్లను షేక్‌ఖాజా వాట్సాప్‌కు పంపించాడు. పరీక్ష రాయకుండానే సర్టిఫికెట్లు రావడంపై అనుమానం వచ్చిన షేక్‌ఖాజా.. వాటిని పరిశీలించగా అవి నకిలీవని తేలింది. దీంతో బాధితుడు మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు, మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు రంగంలోకి దిగారు.
ఇప్పటి వరకు 430 సర్టిఫికెట్లు చలామణి..
నకిలీ సర్టిఫికెట్ల తయారీ, చలామణిలో కీలక పాత్ర పోషిస్తున్న గీకురు ప్రేమ్‌కుమార్, శర్మను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా మేఘాలయలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీకి చెందిన మాజీ ఎగ్జామినేషన్ కంట్రోలర్ అఖిలేవ్ సెమ్వాల్ సహాయంతో నకిలీ స్టడీ సర్టిఫికెట్లను జారీ చేస్తున్నట్లు నిందితులు అంగీకరించారు. ఇప్పటి వరకు 430 నకిలీ సర్టిఫికెట్లను జారీచేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు నగరంలోని శర్మ, ప్రేమ్‌కుమార్‌ను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. నిందితుల పెద్ద మొత్తంలో నకిలీ సర్టిఫికెట్లు, ఇతర పత్రాలు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠాను పట్టుకున్న పోలీసులను సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అభినందించారు.