సిటీబ్యూరో, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ), మారేడ్‌పల్లి : ప్రతిష్టాత్మకమైన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీ డెవలప్మెంట్లో భాగంగా.. 26 లిఫ్టులతో కొత్త స్టేషన్ భవనం ఏర్పాటు చేయబోతున్నారు. ప్రయాణికుల సౌకర్యం కోసం 32 ఎస్కలేటర్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. స్టేషన్ పునరాభివృద్ధి అంశంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎస్సీఆర్ జీఎం అరుణ్‌కుమార్ జైన్, సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఏకే గుప్తాతో కలిసి సోమవారం సమీక్ష నిర్వహించారు. రెగ్యులర్ రైళ్లకు ఎలాంటి అటంకాలు లేకుండా ఈ ప్రాజెక్టు సకాలంలోనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోనున్నారు. రాబోయే 40 సంవత్సరాల ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, వాటికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. మొత్తంగా విమానాశ్రయం తరహాలో స్టేషన్ పునరాభివృద్ధికి ప్రణాళిక రూపొందించారు. ఈ సమావేశంలో కన్‌స్ట్రక్చన్ సీఏవో నీరజ్ అగర్వాల్, ఇతర రైల్వే సిబ్బంది పాల్గొన్నారు.
మూడు దశల్లో పనులు పూర్తి..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీ డెవలప్మెంట్ను మొత్తం మూడు దశల్లో పూర్తి చేయనున్నారు. తొలి దశ 16 నెలలు, రెండో దశ 28 నెలలు, మూడో దశకు 36 నెలల సమయం పట్టనుంది.