సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): మహానగరం అభివృద్ధిలో శరవేగంగా దూసుకుపోతున్నది. భవిష్యత్ తరాలకు అద్భుతమైన హైదరాబాద్‌ను అందించేందుకు నభూతో నభవిష్యతి అన్నట్లు మౌలిక వసతులు కల్పిస్తున్నది తెలంగాణ సర్కారు. వ్యూహాత్మక రహదారి అభివృద్ధి పథకంలో భాగంగా మెరుగైన రవాణా వ్యవస్థను సమకూర్చుతున్నది. ఈ క్రమంలోనే రానున్న ఆర్థిక సంవత్సరంలోనూ(2023-24) భారీ ఎత్తున రహదారుల నిర్మాణానికి బల్దియా బడ్జెట్లో ఏకంగా రూ. 1530 కోట్లు కేటాయించింది. భూసేకరణకు అదనంగా మరో 700 కోట్లను ఖర్చు చేయనున్నది.
విశ్వ నగరంగా ఎదిగిన హైదరాబాద్‌లో మౌలిక వసతుల కల్పన అంతకంతకూ పెరుగుతున్నది. ఊహించని రీతిలో రహదారుల నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం ఈ యజ్ఞాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నది. రానున్న ఆర్థిక సంవత్సరంలోనూ భారీ ఎత్తున రహదారుల నిర్మాణానికి గాను జీహెచ్ఎంసీ బడ్జెట్లో సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ నిధులు కేటాయించారు. ఇందులో భాగంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.1530 కోట్లు వెచ్చించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో 9,013 కిలోమీటర్ల పొడవున రహదారులు ఉన్నాయి. ఇందులో 2,846 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లు ఉండగా… 6,167 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్‌కు అనుగుణంగా పెద్ద ఎత్తున ఫ్లైఓవర్లు, రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు, రోడ్డు అండర్ బ్రిడ్జిలు, రహదారుల విస్తరణ, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాలు చేస్తున్నారు. 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరంలో గ్రేటర్ పరిధిలోని రోడ్ల నిర్వహణకు జీహెచ్ఎంసీ రూ.1,018.19 కోట్లు ఖర్చు చేసింది. అలాగే నూతన నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేసింది. ముఖ్యంగా 2015లో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి (ఎస్ఆర్డీపీ) చేపట్టగా… మొదటి దశలో రూ.8,052 కోట్లతో 47 నిర్మాణాలు తీసుకోగా… ఇప్పటికే 32 ప్రాజెక్టులు పూర్తయి అందుబాటులోకి వచ్చాయి. మిగిలిన వాటి పనులు పురోగతిలో ఉన్నాయి.
సర్కారుపై విశ్వాసం..
గతంలో నగరంలో రోడ్డు విస్తరణ చేపట్టాలంటే భూసేకరణకు ఏండ్లు పట్టేది. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రహదారుల విస్తరణ, నూతన నిర్మాణాలకు సంబంధించి భూ సేకరణ వేగంగా ముందుకు సాగింది. అందుకే 2021-22 నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు భూసేకరణ కింద జీహెచ్ఎంసీ రూ.2,234.92 కోట్లు ఇచ్చింది. ఇందులో రూ.1,736.72 కోట్ల విలువైన టీడీఆర్ (ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్) సర్టిఫికెట్లు జారీ చేశారు. కేవలం 2021-22 సంవత్సరంలో ఎస్ఆర్డీపీ నిర్మాణాలకు చేపట్టిన భూసేకరణకే రూ.1,808 కోట్ల వరకు పరిహారం ఇవ్వడం జీహెచ్ఎంసీ చరిత్రలోనే రికార్డు. కాగా తాజా ఆర్థిక సంవత్సరంలో భూసేకరణ కింద రూ.700 కోట్లు ఇవ్వనున్నట్లు సవరణ బడ్జెట్లో జీహెచ్ఎంసీ పేర్కొన్నది. ఈ క్రమంలో ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు మరో రూ.321.51 కోట్ల వరకు ఇవ్వనుంది.
రెండో విడుతకూ సన్నాహాలు..
వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమాన్ని (ఎస్ఆర్డీపీ) రెండో విడుతలో కూడా చేపట్టేందుకు ఇప్పటికే అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి రెండో దశను రూ.11వేల కోట్లతో చేపడుతామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా జీహెచ్ఎంసీ 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.1530 కోట్లను కేటాయించింది. అదనంగా మరో రూ.700 కోట్లను భూసేకరణకు ఖర్చు చేయనున్నట్లు స్పష్టం చేసింది. అయితే ఇంత పెద్ద మొత్తాన్ని ఖర్చు చేసేందుకు అవకాశమున్నదని గత రెండేండ్ల అనుభవాలే స్పష్టం చేస్తున్నాయి. 2021-22 నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ వరకు రూ.3,419 కోట్లు ఖర్చు చేయగా… ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి మరో రూ.1 023 కోట్లు ఖర్చు చేయనున్నట్లు జీహెచ్ఎంసీ ప్రకటించింది.
9,013 కిలోమీటర్ల పొడవున
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 9,013 కిలోమీటర్ల పొడవున రహదారులు ఉన్నాయి. ఇందులో 2,846 కిలోమీటర్ల బీటీ ఉంటే.. 6,167 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లున్నాయి. నగర అభివృద్ధికి బహుముఖ వ్యూహంతో ముందుకెళ్తున్న సర్కారు.. ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా పెద్ద ఎత్తున ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, ఆర్వోబీలు, ఆర్‌యూబీలు నిర్మిస్తున్నది. 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరంలో రోడ్ల నిర్వహణకు జీహెచ్ఎంసీ ఏకంగా రూ.1,018.19 కోట్లు ఖర్చు చేయడం విశేషం.