రామచంద్రాపురం,నవంబర్12: లోక కల్యాణం కోసం బ్రాహ్మణులంతా ఏకమై రుద్రసహిత శతచండీ మహాయాగాన్ని నిర్వహించడం సంతోషంగా ఉన్నదని శ్రీ మాధవానంద సరస్వతీ స్వామి అన్నారు. సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం డివిజన్ కాకతీయనగర్ కాలనీలో ఉన్న సీతారామచంద్ర స్వామి ఆలయంలో మండల బ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రుద్రసహిత శతచండీ మహాయాగానికి శ్రీ మాధవానంద సరస్వతీ స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు వేదపండితులు, బ్రాహ్మణ సంఘం సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. యాగం జరుగుతున్న తీరుని, పద్ధతిని స్వామివారు అడిగి తెలుసుకున్నారు. ధర్మబద్ధంగా, శాస్త్రబద్ధంగా శతచండీ యాగం నిర్వహిస్తున్నారని స్వామివారు సంతోషం వ్యక్తం చేశారు.
మన చుట్టూ ఉన్న ప్రజలతో పాటు రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో బ్రాహ్మణులంతా ఏకమై శాస్త్రం చెప్పినట్టుగా శతచండీ యాగాన్ని నిర్వహించడం శుభసూచకమని అన్నారు. అనంతరం నూతనంగా నిర్మించిన స్వామివారి ఆశ్రమాన్ని ప్రారంభించి భక్తులకు అనుగ్రహం ఇచ్చారు. యాగంలో భాగంగా రెండో రోజు శాంతిపఠనంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రహణ దోషాలు తొలిగిపోవడానికి పలు హోమాలు, తదితర స్థాపిత దేవతా పూజలు, పారాయణాలు, ప్రవచనాలు, హారతి కార్యక్రమాలు నిర్వహించారు. కర్ణాటక, శృంగేరి, వివిధ దైవ క్షేత్రాల్లో మహాయాగాలు చేసిన వేదపండితులు సుమారు వంద మంది ఈ చండీయాగం నిర్వహిస్తున్నారు. బెంగళూరు నుంచి వచ్చిన కార్తిక్ శర్మ మండలాలు వేశారు. యాగాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తుల కోసం నిత్యాన్నదానం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బ్రాహ్మణ సమైక్య సంఘం సభ్యులు, మండల బ్రాహ్మణ సంఘం సభ్యులు, భక్త జనం తదితరులు పాల్గొన్నారు.