సికింద్రాబాద్, నవంబర్ 12 : పోలీస్ శిక్షణ అభ్యర్థులకు ఉద్యోగం సాధించడమే లక్ష్యం కావాలని పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఎస్పీ పరవస్తు మధుకర్‌స్వామి సూచించారు. ఈ మేరకు శనివారం సికింద్రాబాద్‌లోని ఎస్వీఐటీ కళాశాల ప్రాంగణంలో ఇటీవల నిర్వహించిన ఉచిత శిక్షణ అర్హత పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులకు పరవస్తు క్రియేటీవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణతో చదువుకొని ఉద్యోగం సాధించాలన్నారు. పరవస్తు క్రియేటీవ్ ఫౌండేషన్, శ్యామ్ ఇనిస్టిట్యూట్ హైదరాబాద్ సహకారంతో కానిస్టేబుల్స్, సబ్ ఇన్స్పెక్టర్లకు మెయిన్ పరీక్ష నిర్వహించే వరకు శిక్షణ ఉంటుందన్నారు.
ఇప్పటికే అర్హత పరీక్షల్లో మెరిట్ సాధించిన అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సదుపాయం, డ్రస్, స్టడీ మెటీరియల్‌లతో పాటు ప్రత్యక్ష బోధన ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రీన్‌ల్యాండ్స్ లయన్స్‌క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గంధాని శ్రీనివాస్, గౌరవ అధ్యక్షుడు విద్యాభూషణ్, అధ్యక్షులు డాక్టర్ లక్ష్మికుమారి, రీజినల్ చైర్మన్ రఘునాథ్‌రెడ్డి, కార్యదర్శి గురుసేవతో పాటు లయన్స్‌క్లబ్ బంజారాహిల్స్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఉపేందర్, మదర్ వెల్ఫేర్ ఫౌండేషన్ అధ్యక్షుడు రాధాకృష్ణ, ఉపాధ్యక్షుడు జావెద్ పటేల్, అంతర్జాతీయ అథ్లెటిక్ క్రీడాకారిణి ఉదయలక్ష్మి, పరవస్తు క్రియేటీవ్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శులు సందీప్ హరి, గద్దె భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.