బంజారాహిల్స్, నవంబర్ 12 : జూబ్లీహిల్స్ డివిజన్ పద్మాలయ అంబేద్కర్ నగర్ బస్తీలో కమ్యూనిటీహాల్ కోసం కేటాయించిన రెవెన్యూ స్థలాన్ని కాపాడేందుకు షేక్‌పేట మండల సిబ్బంది శనివారం రంగంలోకి దిగారు. బస్తీలో సుమారు 100గజాల స్థలాన్ని పదేళ్ల క్రితమే కమ్యూనిటీహాల్ కోసం కేటాయించారు. అయితే ఈ స్థలంలో కొంతభాగం తనకు కావాలంటూ స్థానికంగా నివాసం ఉంటున్న ఓ బస్తీ నేత గతంలో జీవో 58 కింద క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఖాళీ స్థలాన్ని క్రమబద్ధీకరణ కుదరదని, ఈ స్థలాన్ని కమ్యూనిటీహాల్ కోసం కేటాయించారని అధికారులు దరఖాస్తు తిరస్కరించారు. ఇదిలా ఉండగా ఇటీవల ఈ స్థలాన్ని అక్రమించుకుని ప్రహరీ నిర్మాణం చేపట్టిన కృష్ణ అనే వ్యక్తిపై షేక్‌పేట మండల తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదుతో రెండునెలల క్రితం జూబ్లీహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. బస్తీలో ప్రజల అవసరాల కోసం వినియోగించాల్సిన స్థలాన్ని ఓ వ్యక్తి కబ్జా చేశారని బస్తీవాసులు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. దాంతో బస్తీవాసుల అభీష్టం మేరకు కమ్యూనిటీహాల్ నిర్మిస్తామని ఎమ్మెల్యే దానం హామీ ఇచ్చారు. ఈ వ్యవహారంపై స్థానికులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో శనివారం షేక్‌పేట మండల తహసీల్దార్ రామకృష్ణ నాయక్ ఆదేశాలతో రెవెన్యూ సిబ్బంది అక్కడకు చేరుకుని కమ్యూనిటీ హాల్ స్థలంలో ప్రభుత్వ హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. అయితే అక్కడకు చేరుకున్న కృష్ణ కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది బంధువులు, స్నేహితులు రెవెన్యూ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని శాంతింపచేశారు.