ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 12 : ప్రధాని నరేంద్రమోడీ రాష్ట్ర పర్యటనపై విద్యార్థి లోకం ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణకు ఏం చేశాడో చెప్పిన తరువాత రాష్ట్రంలో పర్యటించాలని ముందుగానే అల్టిమేటం జారీ చేసిన విద్యార్థులు పర్యటనకు వ్యతిరేకంగా వివిధ రూపాలలో నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులు వేర్వేరుగా తమ నిరసనను ప్రదర్శించారు. కానీ అందరి నోటివెంట వచ్చింది ఒకటే నినాదం ‘మోడీ గో బ్యాక్… మోడీ గో బ్యాక్…’. శనివారం ఉదయం నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆర్ట్స్ కళాశాల వైపు వచ్చే అన్ని దారుల్లో పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి విద్యార్థి నేతల హాస్టల్ గదుల్లోకి వెళ్లి ముందస్తు అరెస్టులు చేశారు. టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఆధ్వర్యంలో ఒక్కసారిగా ఆర్ట్స్ కళాశాల ఆవరణకు వచ్చిన విద్యార్థి బృందం నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేస్తూ ప్రధాన రహదారిపై పరుగులు తీశారు. ల్యాండ్‌స్కేప్ గార్డెన్ వద్ద పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వెంటనే టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు లా కళాశాల ఎదురుగా ఆందోళన చేపట్టారు. టీఆర్ఎస్వీ మరో బృందం సైన్స్ కళాశాల వైపు నుంచి ఆర్ట్స్ కళాశాల వైపునకు మోడీ దిష్టిబొమ్మతో వచ్చేందుకు ప్రయత్నించగా, వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత కూడా పలువురు విద్యార్థి నాయకులను హాస్టల్ గదుల నుంచి అదుపులోకి తీసుకుని వేర్వేరు పోలీస్ స్టేషన్లకు తరలించారు.