గోల్నాక, నవంబర్ 12 : ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అర్హులైన లబ్ధిదారులకు అందే విధంగా న్యాయ సేవ అధికార సంస్థ వారధిలా నిలుస్తున్నదని హైదరాబాద్ సివిల్ కోర్టు చీఫ్ జస్టిస్ రేణుకా యారా తెలిపారు. శనివారం హైదరాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, సిటీ సివిల్ కోర్టు ఆధ్వర్యంలో అంబర్పేట మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన మెగా న్యాయ అవగాహన శిబిరాన్ని ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..న్యాయ విజ్ఞానం ద్వారా పౌరుల సాధికారత సాధించే నినాదంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పని చేస్తున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను వివరిస్తూ 30 ఎగ్జిబిషన్ స్టాళ్లు.. ఉచిత వైద్య శిబిరం, న్యాయ సేవా శిబిరాలకు భారీ స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఉమెన్ సేఫ్టీ వింగ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రఘువీర్, జీహెచ్ఎంసీ ప్రాజెక్ట్ డైరెక్టర్ సౌజన్య, సిటీ సివిల్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రామచంద్రన్, సీనియర్ సివిల్ న్యాయమూర్తి మురళీమోహన్, న్యాయమూర్తులు కాంచనరెడ్డి, అబ్దుల్జలీల్, కళార్చన, కుష్బూ ఉపాధ్యాయ, మంజుల, వింద్యానాయక్, న్యాయవాదులు హరిమోహన్రెడ్డి, బాలకృష్ణతో పాల్గొన్నారు.