ఉస్మానియా యూనివర్సిటీ, నవంబర్ 12: సామాజిక పరిస్థితులకు అనుగుణంగా పాఠ్యప్రణాళిక ఉండాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అభిప్రాయపడ్డారు. శనివారం ఉస్మానియా యూనివర్సిటీలో ‘ఎమర్జింగ్ చాలెంజెస్ ఇన్ ఎడ్యుకేషన్’ అనే అంశంపై సదస్సును నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వినోద్‌కుమార్ మాట్లాడుతూ విద్యాభ్యాసంతో పాటు సామాజిక అంశాలపై విద్యార్థులు దృష్టిని సారించాలని పిలుపునిచ్చారు. విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలపై మరింత లోతుగా అధ్యయనం జరగాలని అధ్యాపకులు, విద్యార్థులకు సూచించారు. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల్లో అధ్యాపకులు, ఉద్యోగాల భర్తీ కోసం కామన్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఏర్పాటు చేస్తూ ఇటీవల అసెంబ్లీలో బిల్లును ఆమోదించినట్లు చెప్పారు. ఈ ఫైలుకు త్వరలోనే గవర్నర్ ఆమోదం తెలుపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.