అమీర్‌పేట్, నవంబర్ 12: వాహనదారులకు, పాదచారులకు ఇబ్బందులు కలిగిస్తున్న ఎర్రగడ్డ చౌరస్తా నుంచి ఫతేనగర్ ఫ్లై ఓవర్ వరకు ఇరువైపులా ఉన్న రహదారుల ఆక్రమణలను తక్షణమే తొలగించాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అన్ని విభాగాలు సమన్వయంతో స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఈ నెలాఖరు నాటికి ఆక్రమణలను పూర్తి స్థాయిలో తొలగించాలన్నారు. ఇటీవల సనత్‌నగర్ ప్రధాన రహదారిపై ఫుట్‌పాత్ ఆక్రమణలకు సంబంధించి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో శనివారం ఉదయం జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్, డిప్యూటీ కమిషనర్ మోహన్‌రెడ్డి, బాలానగర్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్‌రెడ్డిలతో కలిసి జెక్కాలనీ గాంధీ విగ్రహం నుంచి సనత్‌నగర్ పీఎస్ వరకు మంత్రి తలసాని కాలి నడకన ఫుట్‌పాత్ ఆక్రమణలు స్వయంగా పరిశీలించారు. వాటిని తక్షణమే తొలగించాలని ఆదేశించారు. మంత్రి వెంట సనత్‌నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మిరెడ్డి, జెక్కాలనీ ఫెడరేషన్ అధ్యక్షులు జి.సూర్యశంకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.