మియాపూర్/మాదాపూర్, నవంబర్ 12: ఒకప్పుడు మురికి కూపంగా ఉన్న అలీ తలాబ్ చెరువును సుందరీకరించి మహర్దశ తీసుకురానున్నామని ఎమ్మెలే, విప్ అరెకపూడి గాంధీ తెలిపారు. హైదర్‌నగర్ డివిజన్ అలీ తలా బ్ చెరువు వద్ద అలుగు నిర్మాణం, మురికి నీటి డైవర్షన్ కోసం పైప్లైన్ల నిర్మాణం నిమిత్తం రూ.1.83 కోట్ల నిధులతో చేపడుతున్న పనులకు కార్పొరేటర్ శ్రీనివాస్‌రావుతో కలిసి విప్ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మురుగు జలాలు కలవకుండా నివారించి మరింతగా అందంగా తయారు చేస్తామని, చెరువు కట్టను పటిష్ట పరిచి సౌకర్యవంతమైన వాకింగ్ ట్రాక్‌ను సైతం నిర్మిస్తామన్నారు. డైవర్షన్ పైప్లైన్ల ద్వారా మురుగు నీరు చెరువులోకి రాకుండా నిరోధించి శుభ్రమైన జలాలతో కళకళలాడేలా చేస్తామన్నారు. చెరువు స్థలం ఆక్రమణలకు గురికాకుండా చుట్టూ ఫెన్సింగ్‌తో సంరక్షించుకుంటామని గాంధీ పేర్కొన్నారు. గుర్రపు డెక్క తొలగించి దోమల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. నిర్మాణ పనులను నాణ్యతతో చేపట్టాలని, సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన అధికారులకు సూచించారు. నియోజకవర్గంలోని చెరువులన్నింటినీ సుందరీకరించి అందమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ప్రజలకు అందిస్తున్నట్లు విప్ గాంధీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ నరేంద్ర, ఏఈ విశ్వనాథ్, మహాదేవ్, పార్టీ నేతలు, మహి ళా నేతలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా..
హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని ప్రకాశ్‌నగర్‌లో రూ.42 లక్షల వ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ శనివారం జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం ఓ వైపు సంక్షేమం.. మరో వైపు అభివృద్ధిపై దృష్టి సారిస్తు నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతుందన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతానని అన్నారు. నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తు ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. హఫీజ్‌పేట్ డివిజన్లో ఎన్నో ఏండ్ల సమస్యలు నేటితో తీరనున్నవని చెప్పారు. అభివృద్ధిలో భాగంగా చేపట్టిన సీసీ రోడ్డు పనులను అధికారులు నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. ట్రాఫిక్‌తో ఇబ్బందులు లేకుండా ఇప్పటికే నియోజకవర్గంలోని అనేక చోట్ల ప్రజలకు మెరుగైన రోడ్లను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. పనుల్లో ఎటువంటి జాప్యం లేకుండా నిర్ణీత వ్యవధిలో పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఈఈ శ్రీకాంతిని, డీఈ స్రవంతి, ఏఈ ప్రతాప్, హఫీజ్‌పేట్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్, ప్రకాశ్‌నగర్ కాలనీ అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, రాజేశ్వర్ రావు, ఆంజనేయులు, పరమేష్, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.