అబిడ్స్, నవంబర్ 12 : ప్రధాని నరేంద్రమోదీ పర్యటన సందర్భంగా శనివారం టీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. టోలిచౌకిలో తెలంగాణ వక్ఫ్ బోర్డు మాజీ డైరెక్టర్ వహీద్ అహ్మద్ ఆధ్వర్యంలో మోదీ గో బ్యాక్.. అంటూ ప్ల కార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ర్టానికి నిధులు రాకుండా, రైతుల మోటర్లకు మీటర్లు పెట్టేందుకు ప్రధాని కుట్రలు పన్నుతున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ షేక్పేట్ డివిజన్ ప్రధాన కార్యదర్శి ఎండీ.షకీల్ అహ్మద్, మైనార్టీ సెల్ నుంచి అకీల్ అహ్మద్ పాల్గొన్నారు.
చార్మినార్ వద్ద.. మోదీకి నిరసన సెగ
శాలిబండ, నవంబర్ 12 : ప్రధాని నరేంద్రమోదీ పర్యటన నేపథ్యంలో పాతనగరంలో శనివారం టీఆర్ఎస్ నాయకులు పలు చోట్ల నిరసన కార్యక్రమాలను చేపట్టారు. టీఆర్ఎస్వీ నాయకులు ఖుర్రం అలీ ఆధ్వర్యంలో చార్మినార్ గుల్జర్హౌస్ వద్ద ‘ మోదీ గో బ్యాక్ ’ అంటూ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఖుర్రం అలీ మాట్లాడుతూ.. విభజన హామీలను గాలికొదిలిన ప్రధాని మోదీ ముందస్తుంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఎప్పుడో యూరియా ఉత్పత్తిని ప్రారంభించి రైతన్నలకు అండగా నిలిచిన ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభోత్సవ కార్యక్రమం అంటూ.. దేశ ప్రజలను మభ్య పెట్టడానికి తెలంగాణ రాష్ట్రంలో పర్యటన చేపట్టారని విమర్శించారు. బీజేపీ నాయకులు ఈ మాయ మాటలను తమ గొప్ప పనులుగా ప్రచారం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు.మునుగోడు ఓటమితోపాటు ఫాం హౌస్ కుతంత్రాల బీజేపీ త్రయం విచారణల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే మోదీ రాష్ట్ర పర్యటన అని అభివర్ణించారు. అనంతరం టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసిన నాయకులను చార్మినార్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సొంత పూచికత్తులపై తర్వాత విడుదల చేశారు.