హిమాయత్‌నగర్, నవంబర్ 12 : తాగునీటి బిల్లులను చెల్లించకుండా మొండికేస్తున్న వినియోగదారులను దారికి తెచ్చేందుకు నారాయణగూడ జలమండలి అధికారులు కసరత్తు చేస్తున్నారు. బిల్లులు చెల్లించకుండా జాప్యం చేసే వినియోగదారులను గుర్తించి బిల్లులు చెల్లించాలని కోరుతున్నారు. రిజర్వాయర్ల నుంచి వెళ్ల్లే నీటికి, బిల్లుల రూపంలో వచ్చే ఆదాయంను మరింత పెంచేందుకు కృషి చేస్తున్నారు. ఈ డివిజన్ పరిధిలో సుమారు 76,000 వేల కనెక్షన్లకు తాగునీటి సరఫరా జరుగుతుండగా.. ప్రతి నెల సుమారు రూ.5కోట్లకుపైగా బిల్లుల రూపంలో ఆదాయం రావాల్సి ఉండగా.. కొంతమంది వినియోగదారులు నీటి బిల్లులు చెల్లించడంలో కాలయాపన చేస్తున్నారు. ఈ కనెక్షన్ల నుంచి సరఫరా అవుతున్న నీటి బిల్లుల బకాయిలను వసూలు చేసేందుకు ఇంటికి వెళ్లి పరిస్థితిని వివరిస్తున్నారు.
బకాయి బిల్లులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలని అధికారులు కోరుతున్నారు. ప్రతి నీటి చుక్కకు లెక్క తేలాల్సిందేనని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతి నల్లాకు మీటరు అమర్చుకునేలా వినియోగదారులకు అవగాహన కల్పిస్తున్నారు. బస్తీలు, కాలనీల్లో నీటి మీటరు లేని వారు అమర్చుకోవాలని నోటీసులు జారీ చేయడంతోపాటు బకాయి ఉన్న బిల్లులను రాబట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. నోటీసులు అందుకున్న వినియోగదారులు పక్షం రోజుల్లో మీటరును అమర్చుకోవాలని, లేని పక్షంలో వారందరికీ ప్రస్తుతం కంటే రెట్టింపు స్థాయిలో బిల్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
నల్లాకు మీటరు అమర్చుకోవాలి
ప్రతి నల్లాకు మీటరును తప్పనిసరిగా అమర్చుకోవాలి. మీటరును బిగించుకోలేనివారు పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది. నల్లా బిల్లులు బకాయి ఉన్న వారు సకాలంలో చెల్లించాలి. లేనిపక్షంలో వారికి నల్లా కనెక్షన్ తొలగించి నీటి సరఫరా నిలిపివేస్తాం. మీటరు బిగించుకోవడంతో ఏ మేరకు నీటిని వినియోగిస్తే అంతవరకే బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. బకాయిదారులు సకాలంలో నీటి బిల్లులు చెల్లించి అభివృద్ధికి సహకారం అందించాలి.
– శ్రీధర్‌రెడ్డి, జలమండలి జీఎం,నారాయణగూడ