మేడ్చల్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా రెండవ విడత దళితబంధు పథకానికి లబ్ధిదారుల ఎంపిక కొనసాగుతున్నది. నియోజకవర్గానికి 500మంది చొప్పున జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 2500 మందిని ఎంపిక చేయనున్నారు. అంతేకాకుండా జిల్లా పరిధిలోకి వచ్చే ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, సనత్నగర్ నియోజకవర్గాల్లో 63మంది లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 2563 మంది లబ్ధిదారులకు దళితబంధు పథకాన్ని వర్తింపజేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు, అధికారుల పర్యవేక్షణలో లబ్ధిదారులను గుర్తించారు. అయితే మొదటి విడతలో ఎంపికైన ఒక్కో లబ్ధిదారుడికి రూ.10 లక్షలు చొప్పున రూ.56 కోట్ల 30 లక్షల నిధులను అందజేశారు. ఈ పథకం ద్వారా లబ్ధిపొందిన వారు ఇప్పటికే వివిధ వ్యాపారాలు నిర్వహించుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు.
రెండవ విడతలో 2563 మందికి..!
జిల్లా వ్యాప్తంగా 2563 మంది లబ్ధిదారులకు దళితబంధు పథకాన్ని రెండవ విడతలో వర్తింపజేయనున్నాం. అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేస్తాం. దశల వారీగా దళితులందరికీ ఈ పథకాన్ని అందజేసి ఆదుకుంటాం.
– చామకూర మల్లారెడ్డి, రాష్ట్ర కార్మికశాఖ మంత్రి
వారం రోజుల్లో ఎంపిక పూర్తి.!
వారం రోజుల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేస్తాం. జిల్లాలోని ఎమ్మెల్యేల పర్యవేక్షణలో లబ్ధిదారుల ఎంపిక కొనసాగుతున్నది. దళితబంధు పథకం ఇప్పిస్తామని చెప్పే దళారులను నమ్మి మోసపోవద్దు. శాసనసభ్యుల సమక్షంలో అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. జిల్లాలో మొత్తంగా 2500 మంది లబ్ధిదారుల ఎంపికతో పాటు జిల్లా పరిధిలోకి వచ్చే మరిన్ని నియోజకవర్గాలకు చెందిన లబ్ధిదారులను ఎంపిక చేయనున్నాం.
– హరీశ్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్