సిటీబ్యూరో, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): రోప్ అమలుతో వాహనదారుల్లో మార్పు వస్తున్నదని నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్ వెల్లడించారు. ట్రాఫిక్ అంతరాయానికి కారణమయ్యే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని రోప్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 15న రోప్ (రిమూవల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ పార్కింగ్ ఎంక్రోచ్మెంట్స్) ను హైదరాబాద్‌లో ప్రారంభించారు. అప్పటి నుంచి నవంబర్ 9వ తేదీ వరకు రోప్ అమలు తీరు తెన్నులను జాయింట్ సీపీ వివరించారు. నగరంలో ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు రోప్ అమలు చేస్తున్నామని, ట్రాఫిక్ మేనేజ్మెంట్లో ‘4 ఈ’ (ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషన్, ఇంజినీరింగ్, ఎస్టాబ్లిష్మెంట్) విధానం పక్కాగా అమలు చేస్తున్నామని తెలిపారు.
రోడ్లపై వాహనాల రాకపోకలకు ఫుట్‌పాత్ వ్యాపారాలు, దుకాణాలు, వ్యాపార సంస్థలకు సంబంధించిన పార్కింగులు, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నాయని, ఈ అంశాలను ఉల్లంఘిస్తున్న 11,236 మందికి నోటీసులు జారీ చేసినట్లు వివరించారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించే విధంగా వ్యవహరిస్తూ, అవగాహన కల్పించినా మారని 543 మందిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయించినట్లు పేర్కొన్నారు. వాహనాలను రోడ్లపై వదిలేసి, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన 5121 వాహనాలను ఆయా ఠాణాలకు, ట్రాఫిక్ పార్కింగ్ యార్డులకు తరలించామని చెప్పారు. నిబంధనలు పాటించడంతో వాహనాల వేగం పెరగడంతో పాటు పాదచారులు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోడ్లపై నడుచుకుంటూ వెళ్లేందుకు వీలు కలుగుతున్నదని పేర్కొన్నారు.
బస్ స్టాప్ల మార్పు..
వాహనాలు సాఫీగా వెళ్లకుండా ట్రాఫిక్ సమస్యలు సృష్టిస్తున్న 40 బస్ స్టాపుల్లో 14 బస్ స్టాపులను ఇతర ప్రాంతానికి షిప్ట్ చేయగా, మిగతా బస్ స్టాపుల పనులు కూడా జరుగుతున్నాయని రంగనాథ్ తెలిపారు. ఇబ్బందులు కలిగిస్తున్న బస్ స్టాపులను షిఫ్ట్ చేయాలని ట్రాఫిక్ విభాగం నుంచి జీహెచ్ఎంసీకి లేఖ రాశామన్నారు. పనులు యుద్ధ ప్రాతిపాదికన చేయాలని వారిని కోరామని తెలిపారు. 30 ఆటో స్టాండ్లలో నుంచి 19 స్టాండ్లను మరో ప్రాంతానికి తరలించామన్నారు. అవసరమైన చోట కొత్తగా యూ టర్న్‌ల ఏర్పాటు, అవసరం లేని చోట యూ టర్న్‌లను తొలగించేందుకు ఆయా రూట్లను పరిశీలించామన్నారు. ఇందులో భాగంగానే హిమాయత్‌నగర్, జహీరానగర్‌లో యూ టర్న్‌లను మూసివేశామన్నారు. ట్రాఫిక్ సాఫీగా సాగడంలో భాగంగా జీహెచ్ఎంసీ, ఇతర శాఖల అధికారులు, కాలనీ అసోసియేషన్లు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ప్రతినిధులతో కలిసి జుబ్లీహిల్స్, బంజారాహిల్స్, తిరుమలగిరి, ఎస్ఆర్నగర్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల పరిధిలో పర్యటించి తనిఖీలు చేశామన్నారు. నగర రోడ్లపై వాహనదారులు సాఫీగా వెళ్లేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు నుంచి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, వాహనదారులు కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ.. ట్రాఫిక్ విభాగానికి పూర్తి సహకారం అందించాలని జాయింట్ సీపీ కోరారు.
ఫ్రీ లెఫ్ట్.. స్టాప్ లైన్
సిగ్నల్ పడగానే స్టాప్‌లైన్ ముందే వాహనం ఆపాలని, ఫ్రీ లెఫ్ట్‌లు బ్లాక్ చేయవద్దని అవగాహన కల్పించామని రంగనాథ్ తెలిపారు. అవగాహన కల్పించిన తర్వాత కూడా ఉల్లంఘనలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.