బన్సీలాల్‌పేట్, నవంబర్ 11: గాంధీ దవాఖాన మైక్రోబయాలజీ, హాస్పిటల్ పరిపాలనా విభాగం సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన ‘హస్పిటల్ ఇన్ఫెక్షన్ కంట్రోల్’ పుస్తకాన్ని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శుక్రవారం కోఠిలోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దవాఖానలోని ఆపరేషన్ థియేటర్లు, ఐసీయూలు, పోస్ట్ ఆపరేటివ్ విభాగాల వద్ద ఇన్ఫెక్షన్ల నియంత్ర చర్యలు, హానికారక బ్యాక్టీరియా నివారణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమాలను అనుసరించి ఈ పుస్తకంలో చక్కగా వివరించారని మంత్రి తెలిపారు.
తెలంగాణలోని అన్ని ప్రభుత్వ హాస్సిటల్స్‌కు ఈ పుస్తకాన్ని పంపిస్తామని ఆయన పేర్కొన్నారు. అనంతరం కరోనా విపత్కర సమయంలో అద్భుతమైన సేవలు అందించిన గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావును మంత్రి హరీశ్ రావు సన్మానించారు. కరోనా నోడల్ కేంద్రంగా గాంధీ దవాఖానలో లక్ష మందికి పైగా పునర్జన్మను ప్రసాదించడం అరుదైనదని, ప్రపంచంలో ఏ సర్కారు దవాఖానలో కూడా జరగలేదని మంత్రి వైద్యులు, సిబ్బంది కృషిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీఎంఈ డాక్టర్ కే.రమేశ్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ పి.శ్రీనివాస్ రావు, గాంధీ దవాఖాన మైక్రోబయాలజీ విభాగం హెచ్ఓడీ డాక్టర్ ఎస్.రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.