ఎల్బీనగర్/వనస్థలిపురం, నవంబర్ 11 : ఎస్సీ కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేందుకు సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చారని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. దళిత బంధు పథకం ద్వారా సాహెబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన బియ్యం షాపు, గాయత్రీనగర్‌లో ఏర్పాటు చేసిన సెంట్రింగ్ షాపును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితుల అభివృద్ధి, సంక్షేమం పట్ల సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో ఉన్నారన్నారు. దళిత బంధు లాంటి పథకం దేశంలో ఎక్కడా లేదన్నారు. ఇప్పటికే మొదటి విడుత లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో మంజూరు కావడం జరిగిందన్నారు. రెండో విడుత ఎంపిక జరుగుతోందన్నారు. లబ్ధిదారులు ప్రతి పైసాను సద్వినియోగం చేసుకుని ఆర్థిక పరిపుష్టిని సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్‌రెడ్డి, త్రినేత్రాంజనేయ దేవస్థానం చైర్మన్ కొత్త శ్రీధర్‌గౌడ్, సీనియర్ నాయకులు కొంగర మహేశ్, ఉమేశ్‌గౌడ్, పోగుల రాంబాబు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
దళితబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం చారిత్రాత్మక నిర్ణయమని, అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంఆర్డీసీ చైర్మర్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం చంపాపేట డివిజన్లోని మారుతీనగర్‌కు చెందిన గోకుల్ సరోజకు దళిత బంధు కింద ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బోటిక్ ఎంచుకున్నారు. లింగోజిగూడ డివిజన్లోని గ్రీన్‌పార్కు కాలనీలో నెలకొల్పిన బోటిక్ అండ్ ఎంబ్రాయిడరీ షాపును ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే మిగతా వారికి దళిత బంధు అందుతుందని తెలిపారు. దళితుల సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన పథకమే దళిత బంధు అని కొనియాడారు. కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందుతుందని, తమ అభివృద్ధికి తామే నిర్వహించుకునే దిశగా చైతన్యమై, ఉత్పత్తిలో భాగస్వాములైన నాడే దళితుల సాధికారతకు నిజమైన అర్థం లభిస్తుందన్నారు. పరిశ్రమలను, ఉపాధిని, వ్యాపారాన్ని ఎంచుకుని దళిత సమాజం వ్యాపార వర్గంగా అభివృద్ధి చెందడం కోసం ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు.
ఒకే రకమైన యూనిట్లు నెలకొల్పడం వల్ల ఇబ్బందులు వస్తాయని, దీన్ని దృష్టిలో ఉంచుకుని వివిధ రకాల యూనిట్లు నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎంపికైన లబ్ధిదారులకు రూ.9.90 లక్షలు చెల్లించి మిగతా రూ.10 వేలకు ప్రభుత్వం వాటాగా మరో రూ.10 వేలు కలిపి దళిత రక్షణ నిధిని ఏర్పాటు చేయనుందని వెల్లడించారు. దురదృష్టవశాత్తు మరణిస్తే లబ్ధిదారుల కుటుంబాలను ఆదుకునేందుకు ఈనిధి ఇన్సూరెన్స్ వల్లే ఉపయోగపడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో లింగోజిగూడ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు నల్ల రఘుమారెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు వరప్రసాద్‌రెడ్డి, చంపాపేట డివిజన్ అధ్యక్షుడు రాజిరెడ్డి, నాయకులు సుంకోజు కృష్ణమాచారి, నర్రె శ్రీనివాస్, పార్వతి, రోజారెడ్డి, ప్రభాకర్, ఉమా మహేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.