కేపీహెచ్బీ కాలనీ, నవంబర్ 11 : వివిధ శాఖాధికారులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. శుక్రవారం కూకట్పల్లి జోన్ ఆఫీస్లో జీహెచ్ఎంసీ, విద్యుత్, జలమండలి, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీస్, సీఆర్ఎంపీ, వివిధ విభాగాల అధికారులతో జడ్సీ మమత సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్సీ మమత మాట్లాడుతూ.. గత సమావేశాలలో నిర్ణయించిన ప్రకారం అభివృద్ధి పనులు ముందుకు సాగాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేయడంలో వివిధ శాఖలు సహకరించి సమన్వయంతో పనిచేయాలన్నారు. ముఖ్యంగా వర్షంనీటి కాలువల అభివృద్ధి పనుల్లో ఆటంకాలను పరిష్కరించాలని, నాలాల అభివృద్ధిలో భాగంగా గుర్తించిన భవనాలు, ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సర్కిల్ ఉప కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు రోడ్డు వైడరింగ్ పనులపై దృష్టిసారించాలన్నారు. జలమండలి అధికారులు పనులు చేసేందుకు రోడ్డు కటింగ్ అనుమతులను నిబంధనల మేరకు వెంటనే జారీ చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. అల్వాల్ సర్కిల్లో రోడ్డుపై పొంగి ప్రవహిస్తున్న తాగునీరు, డ్రైనేజీ నీటి ప్రవాహానికి వెంటనే అడ్డుకట్ట వేయాలన్నారు. స్థానిక ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రోడ్డు చెడిపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కేపీహెచ్బీ కాలనీలోని కల్వరీ టెంపుల్ రోడ్డును మరమ్మతు చేయనున్న నేపథ్యంలో ఆ మార్గంలో జలమండలి అధికారులు పైప్లైన్ పనులకు వెంటనే మరమ్మతులు చేయాలన్నారు.
ట్రాఫిక్ ఇబ్బందులపై ఫోకస్..
ప్రధాన రహదారులు, చౌరస్తాలలో ట్రాఫిక్ ఇబ్బందులను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఆయా ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ, ట్రాఫిక్, ఇతర విభాగాల అధికారులు పర్యటించి వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆయా సిగ్నళ్ల వద్ద ఫ్రీలెఫ్ట్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్లవెంట విద్యుత్ దీపాలు ఉండేలా చూడాలని.. రోడ్డు డివైడర్లలో చిన్న మొక్కలు నాటాలని సూచించారు. రోడ్డు మధ్యలో ఉన్న వీధి దీపాలు, విద్యుత్ స్తంభాలను తొలగించాలన్నారు. మూసాపేట చౌరస్తా నుంచి ఆంజనేయనగర్ చౌరస్తా వరకు రోడ్డుకిరువైపులా ఆక్రమణలు తొలగించి వాహనదారులకు, పాదచారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను, సంబంధిత అధికారులను కోరారు. అనుమతులులేని, అనుమతులకు విరుద్ధంగా చేపడుతున్న నిర్మాణాలను గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్ఈ చిన్నారెడ్డి, యూబీడీ డిప్యూటీ డైరెక్టర్ పద్మనాభం, సీపీ ఉమాదేవి, సర్కిళ్ల ఉప కమిషనర్లు, ఏసీపీలు, ట్రాఫిక్, జలమండలి, విద్యుత్, ప్రాజెక్టు, సీఆర్ఎంపీ, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.