ఘట్కేసర్, నవంబర్ 11 : ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక వసతులతోపాటు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వ నిర్ణయించింది. ఇప్పటి వరకు అరకొర సౌకర్యాలతో కొనసాగిన ప్రభుత్వ పాఠశాలలు, ఇక నుంచి ప్రైవేటుకు దీటుగా, అన్ని వసతులతో తయారు కానున్నాయి. సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఆధునిక సౌకర్యాలతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని నిర్ణయించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం చేపట్టిన ‘మన బడి- మన పట్టణం’ కార్యక్రమంలో భాగంగా ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ బాలుర, బాలికల పాఠశాలలను ఎంపిక చేశారు. ప్రస్తుతం బాలుర ప్రభుత్వ పాఠశాలలో 375 మంది, బాలికల పాఠశాలలో 565 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. పాఠశాలలో విద్యార్థులకు సరిపోయే అన్ని మౌలిక సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు.
ప్రభుత్వం ఇందుకు నిధులు సమకూర్చి అభివృద్ధి పనులు చేపట్టింది. కోటి 8లక్షలతో పనులను ప్రారంభించి, బాలర పాఠశాలలో రూ.61లక్షలతో, బాలిక పాఠశాలలో రూ.47 లక్షలతో అదనపు తరగతి గదులు, విశాలమైన భోజన శాల, ఆధునిక మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. ఈమేరకు చైర్పర్సన్ ముల్లి జంగయ్య యాదవ్ ఆధ్వర్యంలో మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా ఇటీవల నిర్మాణ పనులు ప్రారంభమై, నేడు చురుకుగా కొనసాగుతున్నాయి. పాఠశాలలపై ప్రభుత్వం తీసుకున్న నాణ్యమైన విద్యా బోధనతోపాటు ఇంగ్లిష్ బోధన వంటి నిర్ణయాలతో ప్రస్తుతం పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. దీంతో పాఠశాలల్లో ఏర్పాటవుతున్న పలు సౌకర్యాలతో విద్యార్థులకు మంచి వాతావరణం కల్పించడంతోపాటు విద్యా విధానంలో ఆశించిన మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
సీఎం నిర్ణయంతో విద్యా విధానంలో మార్పులు
ఇప్పటి వరకు అరకొర సౌకర్యాలతో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు సీఎం కేసీఆర నిర్ణయంతో అన్ని మౌలిక సదుపాయాలతో తయారవుతున్నాయి. ఈ విధానంతో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మేలు జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలతోపాటు నాణ్యమైన విద్య అందడంతో విద్యా విధానంలో మార్పులు రానున్నాయి. – ముల్లి పావని జంగయ్య యాదవ్, చైర్పర్సన్, ఘట్కేసర్ మున్సిపాలిటీ
సౌకర్యాలతోనే నాణ్యమైన విద్య
పాఠశాలల్లో అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నప్పుడే ఆశించిన నాణ్యమైన విద్యావిధాన సాధ్యమవుతుంది. ప్రస్తుతం పాఠశాలల్లో ప్రభుత్వ కల్పింస్తున్న ఆధునిక సౌకర్యాలు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉపయోగకరంగా ఉంటాయి. సౌకర్యాల మెరుగుతోనే విద్యార్థుల్లో విద్యార్జన ఆసక్తి పెరుగుతుంది.
– కె.పాపిరెడ్డి, ప్రధానోపాధ్యాయుడు, బాలుర పాఠశాల ఘట్కేసర్