అబిడ్స్, నవంబర్11 : జీహెచ్ఎంసీ – 14 వ సర్కిల్లో ఓటరు కార్డులను ఆధార్ కార్డులతో అనుసంధాన కార్యక్రమం కొనసాగుతోంది. సర్కిల్ కార్యాలయం పరిధిలోని బీఎల్ఓలు ఓటరు జాబితాను అనుసరించి ఆధార్ కార్డులను అనుసంధానం చేస్తున్నారు. నివాసాల వారీగా బీఎల్ఓలు వెళ్లి వారి నంబర్లు సేకరించి లింక్ చేస్తున్నారు. – 14 వ సర్కిల్లో 2 లక్షల 45 వేలకుపైగా ఓటర్లుండగా ఓటర్లందరికీ ఆధార్ లింక్ చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఆధార్ లింక్ పనులను పూర్తిచేసేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు 15 వేల పైచిలుకు ఓటరు కార్డులకు ఆధార్ లింక్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఓటరు కార్డుదారులు ఆధార్ లింక్ చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించడంతో కొందరు స్వచ్ఛందంగా కార్యాలయాలకు వెళ్లి తమ ఆధార్ కార్డులను అధికారులకు సమర్పించి లింక్ అప్ చేయించుకుంటున్నారు. బీఎల్ఓలు ఆధార్ కార్డులు సేకరించి లింక్ చేసే పనులను వేగిరం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ జోనల్ కమిషనర్ రవికిరణ్ నేతృత్వంలో 14 వ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ డీడీ నాయక్ పర్యవేక్షణలో అనుసంధాన కార్యక్రమం కొనసాగుతోంది. డీఎంసీ డీడీ నాయక్ ఎప్పటికప్పుడు సిబ్బందితో సమీక్ష నిర్వహించి ఓటరు కార్డులతో ఆధార్ లింక్ సక్రమంగా జరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
ఇప్పటివరకు 15 వేల కార్డుల అనుసంధానం
ప్రతి ఒక్కరూ తమ ఓటరు కార్డును ఆధార్‌తో లింక్ చేసుకోవాలి. తద్వారా ప్రభుత్వపరంగానే కాక అన్ని విషయాల్లో లబ్ధి చేకూరుతుంది. గోషామహల్ సర్కిల్లో ఇప్పటి వరకు 15 వేల ఓటరు కార్డులకు ఆధార్ అనుసంధానం చేశాం. దీనిపై అందరూ సరైన అవగాహన కలిగి ఉండాలి. అనుసంధానం చేసుకునే సమయంలో వారివారి గుర్తింపు కార్డులలో తప్పులు సరిచేసుకోవాలి.
– డీడీ నాయక్, డిప్యూటీ కమిషనర్