సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబరు 9 (నమస్తే తెలంగాణ): నగరానికి తలమానికమైన హుసేన్‌సాగర్‌ను అందమైన పర్యాటక క్షేత్రంగా రూపురేఖలు మారుస్తున్న హెచ్ఎండీఏ ఇప్పుడు మరిన్ని సొబగులు అద్దనుంది. వీనుల విందైన సంగీతాన్ని వినిపిస్తూ అత్యంత ఆకర్షణీయంగా కనిపించేలా సాగర్‌లో.. తేలియాడే (ఫ్లోటింగ్) మ్యూజిక్ ఫౌంటేన్లు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నది. దాంతోపాటు, కరోనా సమయంలో ఆగిపోయిన లేజర్‌షోను కూడా పునరుద్ధరించనున్నారు. ఇందుకోసం సంజీవయ్య పార్కు అనుకూలంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే సండే ఫన్డే వంటి కార్యక్రమాలతో లక్షలాది మంది నగరవాసులకు ఆదివారం ఆటవిడుపు స్థలంగా మారిన హుసేన్ సాగర్ మ్యూజికల్ ఫౌంటేన్, ఫార్ములా ఈ రేసింగ్‌లతో నగరంలోనే అత్యంత క్రేజీ స్పాట్‌గా మారనుందని పర్యాటక విశ్లేషకులు భావిస్తున్నారు.
హుస్సేన్‌సాగర్ చారిత్రక, అంతర్జాతీయ పర్యాటకానికి ఇప్పుడు కేరాఫ్‌గా మారింది. తెలంగాణ పాలనాసౌధం సచివాలయానికి చెంతన ఉన్న ఈ చారిత్రక తటాకం చుట్టూ ఊహించనిరీతిలో అభివృద్ధి సరికొత్త పుంతలు తొక్కుతున్నది. ఇందులో భాగంగా హెచ్ఎండీఏ అధికారులు తాజాగా ఈ సాగర తీరానికి సంగీత సొబగులు అద్దేందుకు కసరత్తు మొదలుపెట్టారు. ఏకంగా హుస్సేన్‌సాగర్‌లోనే కదిలే (ఫ్లోటింగ్) మ్యూజిక్ ఫౌంటెన్లు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు కరోనా తర్వాత పునరుద్ధరణ కాని లేజర్ షోను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే సంజీవయ్య పార్కు వద్ద విశాలమైన స్థలం అందుబాటులో ఉన్నందున సుమారు రూ.18 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ కొత్త ప్రాజెక్టును అక్కడే ఏర్పాటు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
చారిత్రక హుస్సేన్‌సాగర్ పర్యాటక సిగలోకి కనువిందు చేసే మరో నిర్మాణం రాబోతున్నది. అద్భుత కట్టడంగా రూపుదిద్దుకుంటున్న తెలంగాణ సచివాలయం చెంతనే ఉన్న హుస్సేన్‌సాగర్ చుట్టూ ఇప్పటికే అనేక రకాల వినోద, పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. దీంతో పాటు మరో చారిత్రక నిర్మాణంగా తెలంగాణ అమరవీరుల స్థూపం కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఫార్ములా-ఇ రేసింగ్ పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హుస్సేన్‌సాగర్ నీటిలో తేలియాడే రెండు మ్యూజిక్ ఫౌంటెన్లను ఏర్పాటు చేయాలని హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన పనులను ఏజెన్సీకి అప్పగించి పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.
లేజర్ షో పునరుద్ధరణ
లేజర్ షోను కూడా అధికారులు పునరుద్ధరించనున్నారు. వాస్తవానికి గతంలోనే లుంబినీ పార్కులో హైదరాబాద్ చారిత్రక, తాజా ప్రాశస్త్యాన్ని వివరిస్తూ లేజర్ షో ఉంది. కరోనా సమయంలో దీనిని నిలిపివేసిన తర్వాత పునరుద్ధరించలేదు. అయితే తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం నిర్మాణం జరుగుతుండటంతో పాటు హుస్సేన్‌సాగర్‌లో పర్యాటకుల బోటింగ్‌కు కూడా ఇక్కడి నుంచే వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇక ఫార్ములా ఇ-రేసింగ్ కూడా లుంబినీ ముందుగానే వెళ్తుంది. వీటన్నింటికి తోడు కొత్త సచివాలయం కూడా అందుబాటులోకి వస్తే పర్యాటకులకు ఇక్కడ ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. దీంతో లేజర్ షోను మరో ప్రదేశంలో ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు.
సరైన ప్రదేశం ఎంపికపై కసరత్తు
హుస్సేన్‌సాగర్‌లో కొత్తగా రెండు మ్యూజిక్ ఫౌంటెన్లు వస్తున్నందున లేజర్ షోను కూడా పునరుద్ధరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాయంత్రం ఏడు నుంచి పది గంటల సమయంలో 20 నిమిషాల నిడివితో మూడు ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, టీ-హబ్, అవుటర్ రింగు రోడ్డు, మెట్రో రైలు వంటి నిర్మాణాలతో పాటు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం, చెరువుల పునరుద్ధరణ, ఐటీ, ఫార్మా, పారిశ్రామిక రంగాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. ఇలా అన్నింటినీ క్రోడీకరించి పర్యాటకులకు వినోదం, విజ్ఞానం అందించే రీతిలో లేజర్ ప్రదర్శనలను రూపుదిద్దే ప్రతిపాదనను అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్డు ఇప్పటికే కిక్కిరిసిపోయాయి. ఎన్టీఆర్ మార్గ్‌లో ఫార్ములా-ఇ రేస్‌తో పాటు సచివాలయం కూడా ఉంది. దీంతో సంజీవయ్య పార్కు ఇందుకు సరైన ప్రదేశంగా అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది.