సిటీబ్యూరో / కొండాపూర్, నవంబర్ 9 : భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వాలను విశ్వవ్యాప్తం చేయడంతో పాటు భవిష్యత్తు తరాలకు చేరవేసేలా హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ‘రాధాగోవిందుల’ రథ యాత్రను నిర్వహిస్తున్నామని అక్షయపాత్ర తెలుగు రాష్ర్టాల అధ్యక్షుడు శ్రీమాన్ సత్య గౌరచంద్ర దాస ప్రభూజీ తెలిపారు. బుధవారం మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీ కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. నవంబర్ 12న హరేకృష్ణ మూవ్మెంట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాధాగోవిందుల రథయాత్ర వివరాలను వెల్లడించారు. శనివారం సాయంత్రం 4:30 గంటలకు దుర్గంచెరువు పార్కు నుంచి యాత్ర ప్రారంభమై అయ్యప్ప సొసైటీ, 100 ఫీట్ల రోడ్డు మీదుగా సైబర్ టవర్స్, శిల్పారామం, హైటెక్స్ కమాన్ వరకు సాగుతుందన్నారు. ఈ రథయాత్రను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, అక్షయపాత్ర ఫౌండేషన్ చైర్మన్ మధు పండిత్ దాస ప్రారంభిస్తారని తెలిపారు. ఉత్సవ మూర్తులను బంజారాహిల్స్‌లోని గోల్డెన్ టెంపుల్ నుంచి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రథయాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హరేకృష్ణ మూవ్మెంట్, అక్షయపాత్ర ప్రతినిధులు పాల్గొన్నారు