సిటీబ్యూరో, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 24 నియోజకవర్గాల పరిధిలోని ముసాయిదా ఓటరు జాబితాను సంబంధిత ఈఆర్ఓలు విడుదల చేశారు. అత్యధికంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 6,29,036 ఓటర్లు ఉండగా, ఆ తర్వాత కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 6,00,108 మంది ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా చార్మినార్ నియోజకవర్గంలో 2,10,718 మంది ఓటర్లు ఉన్నారు. కాగా మొత్తం ఓటర్లలో పురుషులు 42,57,570, మహిళలు 39,35,694 మంది ఉండగా, ఇతరులు 852 మంది ఉన్నారు. కాగా ఈ ముసాయిదా ఓటరు జాబితా సంబంధించిన అభ్యంతరాలను డిసెంబర్ 8 వరకు స్వీకరించనున్నారు. తుది ముసాయిదా ఓటరు జాబితాను వచ్చే సంవత్సరం జనవరి 5న విడుదల చేయనున్నారు. ముసాయిదా ఓటరు జాబితాలో గల తమ పేర్లను పరిశీలన చేసుకునేందుకు సంబంధిత నియోజకవర్గం ఎలక్ట్రోల్ అధికారి వద్ద గానీ ఆన్లైన్ ద్వారా కూడా పరిశీలన చేసుకోవచ్చని అధికారులు సూచించారు. www.nvsp.com, voter helpline app, www.ceotelangana.nic.in వెబ్ సైట్లో పరిశీలన చేసుకోవచ్చనని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ముసాయిదా ఓటరు జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే డిసెంబర్ 8 వరకు తెలియజేయవచ్చునని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు.
