సిటీబ్యూరో, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ టీచర్ శాసన మండలి ముసాయిదా ఓటరు జాబితాను ఈ నెల 23న విడుదల చేయనున్నారు. ముసాయిదా ఓటరు జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉన్న పక్షంలో లేదా ఇప్పటి వరకు ఓటరుగా నమోదు చేసుకోనివారు నవంబర్ 23వ తేదీ నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు నమోదు చేసుకోవడానికి భారత ఎన్నికల సంఘం అవకాశం కల్పించినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఓటరు నమోదు చేసుకునే సందర్భంలో సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారితో సంబంధిత ధ్రువీకరణ పత్రాన్ని జత చేస్తూ సంబంధిత అసిస్టెంట్ ఈఆర్ఓలకు అందజేయాలని, అదేవిధంగా ఇంటర్మీడియట్ కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్లు కూడా సంబంధిత జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారితో, డిగ్రీ, పీజీ కళాశాలలో పనిచేస్తున్న లెక్చరర్లు సంబంధిత యూనివర్సిటీ ద్వారా నియమించిన నోడల్ అధికారి జారీచేసిన ధ్రువీకరణ పత్రంతో జత చేస్తూ ఓటరు నమోదు చేసుకోవాలని తెలిపారు.
వీరికి గతంలో మాదిరిగానే..!
ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ప్రైవేట్, ఎయిడెడ్, నాన్ ఎయిడెడ్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు 2016 సంవత్సరం నుంచి ఓటరు నమోదుకు అవకాశం కల్పించారు. ఈ సారి కూడా వారు గతంలో మాదిరిగానే నమోదు చేసుకోవచ్చు. ఓటరు నమోదు చేసుకునేవారు నియోజకవర్గం పరిధిలో సాధారణ నివాసి అయి ఉండాలి. ఈ విషయంలో ఏవైనా సందేహాలు, అభ్యంతరాలు ఉంటే జిల్లా ఎన్నికల అధికారి, హైదరాబాద్, కమిషనర్, జీహెచ్ఎంసీ ఎలక్షన్ విభాగంలో పనిచేస్తున్న జాయింట్ కమిషనర్ మారుతీ రావు, 9849462153, సుబ్రమణ్యం, ఓఎస్డీ 9000922878ను కార్యాలయం పనివేళలో సంప్రదించాలని సూచించారు.