సిటీబ్యూరో, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): భయపడొద్దు.. మీ రక్షణ కోసం షీ టీమ్స్ ఉన్నాయి. అన్ని ప్రాంతాల్లో నిఘా ఉంది.. పోకిరీగాళ్ల ఆటలు చెల్లవు.. అంటూ మహిళలకు రాచకొండ పోలీసులు భరోసా ఇస్తున్నారు. ఈ క్రమంలోనే రాచకొండ షీ టీమ్స్ ఆరు వారాల్లో 91 కేసులు నమోదు చేశాయి. ఈ కేసుల్లో 125 మంది ఈవ్ టీజర్లను, మహిళలను వేధించే వారిని అరెస్టు చేసినట్టు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ వెల్లడించారు. ఇందులో 28 మందిపై ఎఫ్ఐఆర్లు, 25 పెట్టీ కేసులు, 38 మందికి కన్సెలింగ్ నిర్వహించినట్టు పేర్కొన్నారు. పట్టుబడిన 125 మందిలో 51 మంది మేజర్లు కాగా, 74 మంది మైనర్లు ఉన్నారని తెలిపారు. వీరికి అల్కాపురి ఎక్స్‌రోడ్డులోని ఎల్బీనగర్ సీపీ క్యాంప్ కార్యాలయ ప్రాంగణంలో భూమిక స్వచ్ఛంద సంస్థ కౌన్సిలర్లు, మానసిక నిపుణుల ద్వారా కౌన్సెలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. వేధింపులకు ఎవరూ భయపడవద్దని, ధైర్యంగా రాచకొండ షీ టీమ్స్, 9490617111, డయల్ 100కు ఫోన్ చేయాలని సీపీ సూచించారు.
కొన్ని ఘటనలు..
మహేశ్వరంలోని మోడల్ స్కూల్లో టీజీటీ ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ చారి, అదే స్కూల్లో పనిచేసే మరో టీచర్‌తో పాటు మహిళా సిబ్బంది, విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటంతో బాధితులు మహేశ్వరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన షీ టీమ్స్ నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించి, అరెస్ట్ చేశారు.
ఖమ్మం జిల్లాకు చెందిన రావుల నాగేశ్వర్ బాధితురాలైన వివాహితకు ఆమె పనిచేసే చోట పరిచయమయ్యాడు. ఆమెతో స్నేహంగా ఉంటూ ఆమె ఫోన్లో నుంచి వ్యక్తిగత ఫొటోలు తీసుకొని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. బాధితురాలు షీ టీమ్స్‌ను ఆశ్రయించడంతో హయత్‌నగర్‌లో కేసు నమోదు చేయించి. నిందితుడిని అరెస్టు చేశారు.
మెట్రో స్టేషన్లో డెకాయి ఆపరేషన్ నిర్వహించి 12 మందిని, అలాగే, వనస్థలిపురం, మల్కాజిగిరి, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, చౌటుప్పల్, భువనగిరి షీ టీమ్స్ డెకాయి ఆపరేషన్లు నిర్వహించి పలువురు ఈవ్ టీజర్లను పట్టుకున్నారు.