మేడ్చల్, నవంబరు 9 : రాష్ట్ర ప్రజలంతా సీఎం కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వంవైపే ఉన్నారని, అన్ని రాజకీయ పార్టీలకు కాలం చెల్లినట్టేనని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. జవహర్‌నగర్ కార్పొరేషన్‌కు చెందిన 100 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బుధవారం బోయినిపల్లిలోని కార్యాలయంలో మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ పార్టీలకు స్థానం లేదని మునుగోడు ఉప ఎన్నిక తేల్చేసిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఇతర ఏ పార్టీలను ఒప్పుకునే పరిస్థితి తెలంగాణలో లేదన్నారు. అధికారం కోసం ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజల నుంచి టీఆర్ఎస్ను దూరం చేయలేరన్నారు. రానున్న రోజుల్లో టీఆర్ఎస్పై విమర్శలు గుప్పించే పార్టీలు, నాయకులకు ప్రజలే బుద్ధి చెపుతారన్నారు. అడుగడుగునా తెలంగాణకు ద్రోహం చేస్తున్న బీజేపీ ప్రభుత్వం నీచంగా వ్యవహరిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా ఆ పార్టీకి ప్రజాధరణ లేకున్నా ఎమ్మెల్యేను కొనుగోలు చేసి, తన ప్రాబల్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. తమది ఉద్యమ పార్టీ అని, సీఎం కేసీఆర్ చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన విషయం అందరికే తెల్సిందేనన్నారు. అన్ని కుట్రలను, కు తంత్రాలను తిప్పికొట్టే సత్తా సీఎం కేసీఆర్‌కు ఉందన్నారు. అలాంటి ఆటలు ఇక్కడ సాగవన్నారు.
ఈ విషయం ఇప్పటికే బీజేపీ నాయకులు బోధపడిందన్నారు. బీఆర్ఎస్గా మారిన టీఆర్ఎస్ భవిష్యత్‌లో తన తడాఖా చూపిస్తుందన్నారు. ఢిల్లీ పీఠాన్ని గడగడలాడిస్తుందని తెలిపారు. దేశ వ్యాప్తంగా సీఎం కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజాధరణ పొందాయన్నారు. పలు రాష్ర్టాల ప్రజలు తమకు తెలంగాణ పథకాలు అమ లు చేయాలని కోరడమే ఇందుకు నిదర్శనమన్నారు. ప్రభుత్వ పనితీరు నచ్చే పలుపార్టీల నాయకులు, ప్రజలు స్వచ్ఛందంగా టీఆర్ఎస్లో చేరుతున్నారని మంత్రి అన్నా రు. టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్‌కు చెందిన మాజీ వార్డు సభ్యుడు బండకింద ప్రసాద్, కందుల కృష్ణ, బోయినిపల్లి నర్సింహ, కేకే చారి, రాహుల్, నాగరాజు, అశోక్గౌ, బాల్ రెడ్డి తదితరులకు గులాబీ కండువా కప్పి, పార్టీలోకి మంత్రి సాదారంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో జవహర్‌నగర్ మేయర్ మేకల కావ్య, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్‌గుప్తా, టీఆర్ఎస్ అధ్యక్షుడు కొండల్, కార్పొరేటర్లు,కోఆప్షన్‌సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.