సిటీబ్యూరో, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) : నియోజకవర్గాల పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రతిపాదనలను వీలైనంత త్వరగా సిద్ధం చేయాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. బుధవారం మాసాబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో హైదరాబాద్ జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే లు మాగంటి గోపినాధ్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, సాయన్నలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఈ నిధులతో నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు మౌలిక వసతులను కల్పించడం, పలు అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ నిధులతో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ, మొకల పెంపకం వంటి కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ జిల్లా ప్లానింగ్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. సురేందర్ తదితరులు పాల్గొన్నారు.