సిటీబ్యూరో, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ ) : జీహెచ్ఎంసీలో స్థాయి సంఘం సభ్యుల ఎన్నికకు సంబంధించిన సభ్యుల నుంచి నామినేషన్ల స్వీకరణ గురువారంతో ముగియనుంది. ఈ నెల 2వ తేదీ నుంచి అధికారులు నామినేషన్లను స్వీకరిస్తుండగా, ఆరు నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఈ క్రమంలోనే బుధవారం ఒకే రోజు 12 మంది కార్పొరేటర్లు నామినేషన్లు సమర్పించారు. అబ్దుల్ వాహెద్, సయ్యద్ సోహెల్ ఖాద్రీ, మహ్మద్ అబ్దుల్ ముక్తదార్, సయ్యద్ మినిహజుద్దీన్, సమీరా బేగం, ఈఎస్ రాజ్ జితేంద్రనాథ్, బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్, టి. మహేశ్వరి, బండారి రాజ్‌కుమార్, వనం సంగీతా యాదవ్, శాంతి సాయిజెన్ శేఖర్లు నామినేషన్లు దాఖలు చేశారు. 11వ తేదీ మధ్యాహ్నం 3 గంటల తర్వాత అభ్యర్థులు సమర్పించిన నామినేషన్ పత్రాలను మరుసటి రోజున పరిశీలించి అర్హుల పేర్లను ప్రకటిస్తారని పేర్కొన్నారు. 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ ఉపసంహరణకు గడువు ఉంటుందని, పోటీలో 15 మంది కన్నా ఎక్కువ మంది బరిలో ఉంటే 19వ తేదీన జీహెచ్ఎంసీ కమిషనర్ కార్యాలయంలో ఎన్నిక పక్రియను నిర్వహించి ఫలితాలను వెల్లడిస్తామని అధికారులు చెప్పారు. పోటీ లేకుంటే ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని స్పష్టం చేశారు.