కొన్ని దీర్ఘకాలిక వ్యాధులు రోగిని అవసాన దశకు చేరుస్తాయి. ముఖ్యంగా చివరి దశలో ఉన్న క్యాన్సర్ రోగుల బాధలు వర్ణణాతీతం. భరించలేని నొప్పులతో వారు పడే అవస్థలు మాటల్లో చెప్పలేనిది. అలాంటి వారిని అక్కున చేర్చుకొని.. సాంత్వన చికిత్సలు అందిస్తున్నాయి పాలియేటివ్ కేంద్రాలు.జీవితం చివరి దశలో ఉన్నవారికి మేమున్నామని..తోడుంటామని ఆత్మీయత పంచి..భరోసా నింపుతున్నాయి. నిస్సహాయ స్థితిలో ఉండి మానసిక క్షోభతో సతమతమవుతున్న సమయంలో అండగా నిలుస్తున్నాయి. కొండంత ధైర్యమిచ్చి.. ఉచితంగా వైద్యసేవలందిస్తున్నాయి.
షాబాద్, నవంబర్ 6: రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండల కేంద్రంలో ఎనిమిది పడకల సామర్థ్యంతో ప్రభుత్వం ‘ఆలన’ పాలియేటివ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేసింది. ఇక్కడ 24 గంటల పాటు రోగులకు వైద్యసేవలందిస్తున్నారు. నెలకు సుమారు 120 మంది వరకు రోగులు ఈ కేంద్రానికి వస్తుంటారని వైద్యసిబ్బంది చెబుతున్నారు. ఒక డాక్టర్తో పాటు మొత్తం 10 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. రోగితో పాటు ఒకరిని సహాయకులుగా ఉండేలా చూసుకుంటున్నారు. మొబైల్ వ్యాన్లో గ్రామాల్లో పర్యటించి.. రోగులను గుర్తించి, అవసరమైన చికిత్సలు కూడా అందిస్తున్నారు. రోగి వెంట వచ్చిన వారి కుటుంబీకులకు క్యాన్సర్ వ్యాధి పట్ల తీసుకునే జాగ్రతలపై అవగాహన కల్పిస్తున్నారు.
నేను కిడ్నీ క్యాన్సర్తో బాధపడుతున్నా.. వైద్యసిబ్బంది మంచిగానే వైద్యం చేస్తున్నారు. ప్రభుత్వం పేద వాళ్లకు ఇలాంటి కేంద్రాల ద్వారా ఉచిత వైద్యం అందించడం సంతోషంగా ఉంది.
-వెంకటేశ్, మోత్కూర్, వికారాబాద్ జిల్లా
కేపీహెచ్బీ కాలనీ, నవంబర్ 6 : కూకట్పల్లిలోని రాందేవ్రావు వైద్యశాల ఆవరణలో ఉన్న కుముదినీ దేవి ఆత్మీయ సంరక్షణ కేంద్రం (హాస్పిక్ అండ్ పాలియేటివ్ కేర్ సెంటర్) 2003లో 24 పడకలతో ఏర్పాటైంది. ఈ కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, 18 మంది నర్సులు, ఇన్చార్జి, సూపర్వైజర్తో పాటు మానసిక వైద్య నిపుణురాలు వైద్యసేవలందిస్తున్నారు. ఎంఎన్జే వైద్యుల సూచనల మేరకు క్యాన్సర్ బాధితులు ఉపశమనం పొందుతున్నారు. ఆ వ్యాధితో ఎవరైనా మరణిస్తే..బాధిత కుటుంబసభ్యులకు మానసిక నిపుణురాలి సహాయంతో మనోైస్థెర్యాన్ని అందిస్తారు. అతడిపై ఆధారపడ్డ కుటుంబానికి అండగా నిలుస్తారు. వారి పిల్లలకు ఉపాధిని కల్పించేలా వివిధ కోర్సుల్లో నైపుణ్యాలను నేర్పించి ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. ఈ కేంద్రంలో మొత్తం 6,746 మంది క్యాన్సర్ బాధితులకు చికిత్స చేశారు. అలాగే ఈ సెంటర్లోనే 2021లో చిన్నారుల కోసం మందార పాలియేటెడ్ కేర్ సెంటర్ను నెలకొల్పారు. క్యాన్సర్తో బాధపడే చిన్నారులకు మానసికంగా ఎదగని పిల్లలు, పుట్టుకతో సమస్యలు ఉన్న వారిని హక్కున చేర్చుకుని ఆత్మీయత పంచుతున్నారు. ఇప్పుటివరకు 311 మంది చిన్నారులకు సేవలందించారు.
కుముదినీ దేవి ఆత్మీయ సంరక్షణ కేంద్రంలో వారం నుంచి నెలా, రెండు నెలల వరకు ఉచిత వైద్య సేవలు అందిస్తారు.వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్నవారిని ఇంటికి పంపిస్తారు.ఆత్మీయ సంరక్షణ కేంద్రానికి వచ్చి ఉండలేని పరిస్థితులు ఉన్నవారు సహాయం కోసం ఆర్జిస్తే నేరుగా ఇంటి వద్దకే వెళ్లి ఉచిత వైద్యసేవలను అందిస్తారు.
పెయిన్ రిలీఫ్ అండ్ పాలియేటివ్ కేర్ కోసం ఎంఎన్జేలో ఒక ప్రత్యేక విభాగాన్నే ఏర్పాటు చేశాం. పదేండ్ల కిందట ఈ విభాగం ఏర్పాటైంది. దక్షిణ భారత దేశంలోనే ఎంఎన్జే పెయిన్ రిలీఫ్ అండ్ పాలియేటివ్ కేర్ సెంటర్ రెండోది. చెన్నైలో కిడ్వైలో ఒక సెంటర్ ఉండగా, తరువాత సెంటర్ ఎంఎన్జేలో మాత్రమే ఉంది. తెలుగు రాష్ర్టాలో ఇదే తొలి కేంద్రం.
– డాక్టర్ జయలత, డైరెక్టర్, ఎంఎన్జె క్యాన్సర్ హాస్పిటల్
మేడ్చల్ /శామీర్పేట, నవంబర్ 5 : మేడ్చల్ జిల్లా తూంకుంటలోని దేవరయాంజల్లో క్యాథలిక్ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రత్యాశ హోలిస్టిక్ పేరిట 15 పడకలతో పాలియేటివ్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నది. ఆరేండ్ల కిందట ప్రారంభమైన ఈ కేంద్రంలో పూర్తి ఉచితంగా వైద్యసేవలందిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో ఆరుగురు ఆశ్రయం పొందుతున్నారు. వారానికి మూడు రోజులు జనరల్ మెడిసిన్ డాక్టర్ ఇల్కా, జనరల్ సర్జన్ డాక్టర్ లలిత కేంద్రాన్ని సందర్శించి, రోగులకు చికిత్స అందిస్తున్నారు. నిర్వాహకులు నాన్ హీలింగ్ అల్సర్, పక్షవాతంతో బాధపడుతున్న వారికి సపర్యలు చేసి..సాంత్వన చేకూర్చుతున్నారు. రక్తపోటు, మధుమేహం పరీక్షలు నిర్వహించి మందులు అందజేస్తారు. అవసరమైతే ఫ్లూయిడ్స్ కూడా ఇస్తారు. క్యాన్సర్ రోగులకు కిమో థెరపి వంటి చికిత్స అందుబాటులో లేకపోయినా.. వైద్యులు ఇచ్చిన సూచనల ప్రకారం మందులను అందిస్తారు. 24 గంటలు పర్యవేక్షిస్తూ అవసరమైన సాయం చేస్తారు. రోగులు త్వరగా కోలుకోవడానికి బలవర్థకమైన ఆహారాన్ని అందజేస్తారు. కొండంత మనోధైర్యాన్ని, మానసిక ప్రశాంతతను తమ ఆత్మీయత, దైవ సందేశం ద్వారా కల్పిస్తారు. ఒకసారి కేంద్రంలో చేరితే మూడు నెలల వరకు నిర్వాహకులు పూర్తి బాధ్యత తీసుకుంటారు. కేంద్రంలో పొందిన సేవలతో ఆరోగ్యం కొంత కుదుట పడి, ఇంటికి వెళ్లిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. వారిని అంతటితో వదిలివేయకుండా డాక్టర్, సిబ్బంది తరచుగా వారి ఇండ్లకు వెళ్లి.. ఆరోగ్యాన్ని పరిశీలిస్తున్నారు. అవసరమైన మందులను ఉచితంగా అందజేస్తున్నారు.
ఆపదలో ఉన్న రోగులకు సేవ చేయడం దైవకార్యంగా భావిస్తున్నాం. ఆ సేవలో ఎనలేని సంతృప్తి ఉంది. ఎంతటి దయనీయ స్థితిలో ఉన్నా.. కేంద్రంలో చేర్చుకొని సేవలందిస్తాం. వైద్యుల పర్యవేక్షణలో ఉన్నతంగా అందించిన సేవలతో ఎంతో మంది కోలుకుంటారు. అంతటితో వారిని వదిలిపెట్టకుండా ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటూ అవసరమైన సాయాన్ని చేస్తున్నాం.
– సిస్టర్ శాంతి, ఇన్చార్జి, ప్రత్యాశ పాలియేటివ్ కేంద్రం, దేవరాయాంజల్