సిటీబ్యూరో, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ (హెచ్-న్యూ) గోవాలో చేసిన భారీ ఆపరేషన్‌తో డ్రగ్ మాఫియాకు వణుకు పుట్టించారు. మాఫియా సామ్రాజ్యాన్ని అతలాకుతలం చేశారు. గోవాలో డ్రగ్ మాఫియా కింగ్ పిన్ ఎడ్విన్ అరెస్టుతో హెచ్‌న్యూ లక్ష్యం నెరవేరినట్లయింది. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్‌ను ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో హెచ్‌న్యూ ఏర్పాటు చేశారు. డ్రగ్ కొనుగోలు, అమ్మకాల లింక్‌లను కట్ చేసేందుకు కృషి చేస్తున్నారు. నేరగాళ్లు ఎక్కడున్నా పక్కా సమాచారంతో పట్టుకుంటున్నారు. వారి నెట్వర్క్ లింక్‌లను తెంచేస్తున్నారు.
గోవాలో డ్రగ్ దందా నిర్వహిస్తున్న ఎడ్విన్‌కు దాదాపు 200 మంది ఏజెంట్లు ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న అతడి నెట్‌వర్క్‌లో వేలాది మంది వినియోగదారులు ఉండే అవకాశం ఉన్నదని, ఆ లింక్‌లను తెగ్గొట్టేందుకు పోలీసులు చర్యలు మొదలుపెట్టారు. ఆంగ్ల భాషపై పట్టున్న ఎడ్విన్.. విదేశీ పర్యాటకులను ఆకట్టుకున్నాడు. ఇదే అతడికి కలిసొచ్చింది. విదేశాల నుంచి వచ్చే కొందరు పర్యాటకులతో సంబంధాలు పెంచుకున్నాడు. అలాంటి వారితో విదేశాల నుంచి తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలు చేసి, ఏజెట్ల సహాయంతో విక్రయించాడు. విదేశాల నుంచి డ్రగ్స్ వస్తున్న మార్గాలపై హెచ్‌న్యూ దృష్టిసారించింది. ఈ క్రమంలోనే ఎడ్విన్‌ను విచారిస్తే చాలా విషయాలు వెలుగుచూస్తాయని భావిస్తున్న పోలీసులు అతడిని కోర్టు అనుమతితో తమ కస్టడీకీ తీసుకోనున్నారు.
గోవాలో ఎడ్విన్ కోటలోకి ఎవరూ వెళ్లలేరు. బడా వ్యాపార వేత్తగా పేరుతెచ్చుకున్నాడు. అతడి వద్దకు పోలీసులు, పొలిటీషియన్స్ వెళ్లలేని పరిస్థితి. అతడి గూర్చి ఎవరైనా వచ్చారంటే.. వెంటనే అతడికి సమాచారం చేరుతుంది. ఎడ్విన్ ఒక శక్తిగా చలామణి అవుతున్నాడు. అతడిని పట్టుకోవడానికి హెచ్-న్యూ బృందం స్థానిక పోలీసుల సహాయం కోరింది. అక్కడి డీజీపీతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కూడా మాట్లాడారు. దీంతో అక్కడి పోలీసులు కూడా హెచ్న్యూకు సహకరించింది. హెచ్-న్యూ పోలీసులు నెల రోజులుగా నిఘా పెట్టి డ్రగ్స్ మాఫియా కింగ్‌పిన్ ఎడ్విన్‌ను పట్టుకొని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.