కీసర, నవంబర్ 6: కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వరస్వామివారి ఆలయానికి భక్తులు ఆదివారం పోటెత్తారు. కార్తిక మాసం కావడంతో ఉదయం నుంచే భక్తులు కీసరగుట్టకు చేరుకొని రాజగోపురానికి ముందున్న శివలింగాలకు తేనె, ఆవుపాలతో భక్తులు ప్రత్యేకంగా అభిషేకాలు నిర్వహించారు. అనంతరం కీసరగుట్టలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్థలంలో మహిళా భక్తులు కార్త్తిక దీపాలను వెలిగించారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి ఉండడంతో కూలైన్లు కిటకిటలాడాయి. వేదపండితులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు.
శివనామస్మరణతో కీసరగుట్ట మారుమోగింది. స్వామివారి దర్శనం అనంతరం భక్తులు నేరుగా కాశీవిశ్వేరాల యం, శ్రీ లక్ష్మీనర్సింహాస్వామి, శ్రీ నాగదేవత ఆలయా న్ని దర్శించుకున్నారు. నగర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు కీసరగుట్ట ఎగ్జిబిషన్ గ్రౌండ్లో వన భోజనాల కార్యక్రమాలను నిర్వహించుకొని సాయంత్రం వరకు సరదాగా గడిపారు. కీసరగుట్టకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయం తరుఫున ఏర్పాట్లు చేశామని ఆలయ చైర్మన్ ఉమాపతిశర్మ, ఆలయ కార్యనిర్వాహణాధికారి సుధాకర్‌రెడ్డి తెలిపారు.
భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్‌కు చెందిన లయన్స్ క్లబ్ వారు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని సర్పంచ్ మాధురి వెంకటేశ్ ప్రారంభించారు. భక్తులు వైద్య శిబిరంలో వైద్య పరీక్షలను చేయించుకొని ఉచితంగా మందులను తీసుకున్నారు.
కీసర, నవంబర్ 6: కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని ఈనెల 8వ తేదీన చంద్రగ్రహణం కారణంగా మంగళవారం ఉదయం 8.30గంటల నుంచి ద్వారబంధనం చేయనున్నట్లు ఆలయ చైర్మన్ తటాకం ఉమాపతిశర్మ, ఆలయ కార్యనిర్వాహణాధికారి సుధాకర్‌రెడ్డి తెలిపారు. చంద్రగ్రహణం కారణంగా ఉదయం ఆలయాన్ని తెరిచి ప్రాతఃకాల శ్రీ స్వామివారికి నిత్యపూజ, అభిషేకాలు చేసి ఉదయం 8.30గంటల నుంచి మూసివేస్తామన్నారు. తిరిగి 9వ తేదీ బుధవారం ఉదయం 6గంటల నుంచి యథావిధిగా భక్తుల దర్శనానికి అవకాశం ఇవ్వనున్నట్లు వారు తెలిపారు.