సిటీబ్యూరో, నవంబర్ 5 ( నమస్తే తెలంగాణ)/ మేడ్చల్ కలెక్టరేట్ : లోక్ అదాలత్లో రాజీమార్గం ద్వారా ఏండ్ల నాటి కేసులను పరిష్కరించుకోవచ్చని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ అన్నారు. నాగారం మున్సిపాలిటీలో శనివారం జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. కుషాయిగూడ పీఎస్లో 2800, మల్కాజిగిరి పీఎస్లో 1490, కీసర పీఎస్లో 601, నేరేడ్మెట్ పీఎస్లో 570, కుషాయిగూడ ట్రాఫిక్ పీఎస్లో 110, మల్కాజిగిరి ట్రాఫిక్ పీఎస్లో 43 కేసులు కలిసి మొత్తం 5,614 కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించారు. ఈ సందర్భంగా సీపీ మహేశ్ భగవత్ మాట్లాడుతూ… తాగి వాహనాలు నడపడం, బహిరంగ ప్రదేశాలో మద్యం సేవించడం, ప్రజలకు ఇబ్బంది కలిగించడం, జాతీయ విపత్తు నిర్వహణ ఉల్లంఘనలకు సంబంధించిన కేసులకు జరిమానా విధించి పరిష్కరించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ప్రిన్సిపల్ జడ్జిలు కె.పూజ, దిలీప్ కుమార్, మల్కాజిగిరి డీసీపీ రక్షితమూర్తి, కుషాయిగూడ ఏసీపీ రష్మీ పెరుమాళ్, కీసర సీఐ రఘువీరా రెడ్డి, వివిధ పోలీస్ స్టేషన్ల సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.
రాజీమార్గమే సులువైన పరిష్కారం
మన్సూరాబాద్, నవంబర్ 5 : ఏండ్ల తరబడి పరిష్కారం కాని కేసులను లోక్ అదాలత్లో రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చని జిల్లా జూనియర్ సివిల్ జడ్జి, 14వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ పి.చందన తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని ఎంఈరెడ్డి గార్డెన్లో శనివారం జాతీయ లోక్ అదాలత్లో భాగంగా మండల న్యాయ సేవాసదన్ ఆధ్వర్యంలో ఫ్రీ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… లోక్ అదాలత్ ద్వారా ఏండ్ల తరబడి పరిష్కారం కానీ ఎన్నో కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఇరు వర్గాలు అంగీకారానికి వస్తే లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కరించుకోవచ్చని అదనపు జూనియర్ సివిల్ జడ్జి, ఏడో అదనపు మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ పి.మారుతి ప్రసాద్ పేర్కొన్నారు. పలు కేసుల్లో చిన్న మొత్తంలో జరిమానా విధించి కేసులను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ వెంకట్ రెడ్డి, వనస్థలిపురం సీఐ సత్యనారాయణ, హయత్నగర్ సీఐ వెంకటేశ్వర్లు, అబ్దుల్లాపూర్మెట్ సీఐ స్వామి, సిబ్బంది వెంకటరమణ, శైలజ, సుధాకర్, బాలక్రిష్ణ, సతీశ్, నర్సింహ, శాంభవి, ఆత్రేయ, సురేశ్, జంగయ్య, రాంచందర్, సిరాజ్ పాల్గొన్నారు.