జవహర్‌నగర్, నవంబర్ 5: మదర్సాలో చదువుకునే విద్యార్థులు సంతోషంగా జవహర్‌నగర్‌లోని మల్కారానికి వచ్చారు. పక్కనే ఉన్న చెరువును చూద్దామని వెళ్లారు. ఈత కొడుదామని చెరువులోకి దిగడంతో లోతు తెలియక నీట మునిగారు. వారిని కాపాడటానికి ప్రయత్నించిన ఉపాధ్యాయుడు కూడా నీటిలో మునిగి చనిపోయాడు. ఈ ఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం… జవహర్‌నగర్ కార్పొరేషన్‌లోని మల్కారానికి చెందిన రెహమాన్ నూతన గృహ ప్రవేశానికి అంబర్‌పేటలోని హనీషా మదర్సాకు చెందిన విద్యార్థులను పిలిచారు. శనివారం ఉపాధ్యాయులతో సహా 40మంది విద్యార్థులు వచ్చారు. ఆనందంతో విద్యార్థులు ఒకరికొకరు ముచ్చటిస్తూ గడిపారు. పక్కనే ఉన్న ఎర్రగుంట చెరువు కనిపించడంతో సరదాగా ఈత కొడదామని 5గురు విద్యార్థులు చెరువులోకి దిగారు. లోతు తెలియక నీటిలో మునిగిపోయారు. వారిని కాపాడుదామని ప్రయత్నించిన ఉపాధ్యాయుడిని విద్యార్థులు పట్టుకోవడంతో ఈత రాక అతడు కూడా చెరువులో మునిగి మృతి చెందాడు.
మృతి చెందిన వారిలో విద్యార్థులు ఇస్మాయిల్(11), జాఫర్(10), సోహెల్(9), అయాన్(9), రియాన్(12), ఉపాధ్యాయుడు యోహన్(25) ఉన్నారు. సంఘటన స్థలాన్ని కుషాయిగూడ ఏసీపీ సాధన రష్మి పెరుమాళ్, సర్కిల్ ఇన్స్పెక్టర్ కె.చంద్రశేఖర్, ఎస్సైలు పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతకు ముందు అందరితో కలివిడిగా గడిపిన వారిని చెరువు రూపంలో మృత్యువు కబళించింది. ఐదుగురు విద్యార్థులు, ఉపాధ్యాయుడి మృతితో మదర్సా ఉపాధ్యాయులు, విద్యార్థుల రోదనలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి.