సిటీబ్యూరో, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): పువ్వులంటే.. ఇంటికి ఇంపు, కంటికి ఆహ్లాదకరం. మరి చలికాలం మొదలైన తరుణంలో మొక్కలు పెరగవని, పుష్పించవని నగరంలోని పలువురు పూల ప్రేమికులు చింతిస్తుంటారు. శీతాకాలం సూర్యుడు తకువ సమయం ఉండడంతో పాటు ఎండ కూడా స్వల్పంగా ఉంటుంది. క్రమంగా చల్లని ఉష్ణోగ్రతలు అధికమైతే.. మొక్కలకు క్లిష్టమైన వాతావరణం ఏర్పడితే.. అనేకరకాల పుష్ప జాతి మొకలు ఆకులను రాలుస్తూ.. నిద్రావస్థకు చేరుకుంటూ ఉంటాయి. ఈ తరుణంలోనే శీతాకాలంలో కూడా వృద్ధి చెందుతున్న కొన్ని పుష్ప జాతులు ఉన్నాయి. అవేంటో చూద్దాం.
స్నోడ్రోప్స్..
అందమైన, కిందికి తిరిగే తెల్లటి రేకులతో విరబూసే గుణం వీటి సొంతం. ఈ స్నోడ్రోప్స్ శీతాకాలంలో విరివిగా పుష్పించే సరైన పుష్ప జాతి మొకలుగా చెబుతుంటారు. ఈ పువ్వులు నవంబర్ ప్రారంభం నుంచి ఫిబ్రవరి వరకూ వికసిస్తూ ఉంటాయి.
పెటునియా..
శీతాకాలంలో పెంచే మొక్కల్లో ప్రకాశవంతమైందిగా చెబుతుంటారు. వింటర్లో పెటునియాస్ మంచి ఎంపికగా సూచించబడుతుంది. ఈ శీతాకాలంలో ‘గ్రాండి ఫ్లోరా’ రకం పెటునియాని ఎంపిక చేసుకోవడం ఉత్తమమని పూలమొక్కల పెంపకందారులు పేర్కొంటున్నారు. ఇవి పెద్ద పరిమాణంలో పువ్వులను కలిగి ఉంటాయి. పెటునియాస్ తెలుపు, పసుపు, గులాబీ, ముదురు క్రిమ్సన్, నలుపు, ఊదా వంటి అనేక రంగుల్లో వస్తాయి.
హెలెబోర్స్..
ఈ మొకకు ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఉంటుంది. దీనిలో వేర్లు లోతుగా పెరుగుతూ రూట్ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. హెలెబోర్స్ చల్లని ఉష్ణోగ్రతను తట్టుకోగలవు. సాధారణంగా ఇవి తెలుపు, గులాబీ, ఊదా వంటి రంగులలో కనిపిస్తాయి. ఈ పువ్వులు పెరుగుతున్నప్పుడు కిందికి వేలాడుతూ ఉంటాయి. అందుకే వాటిని ఎత్తుగా ఉన్న కుండీల్లో పెంచవలసి ఉంటుంది.
కామెల్లియాస్..
శీతాకాలంలో అత్యంత తకువ ఉష్ణోగ్రతలను తట్టుకోగల పుష్ప జాతిగా కామెల్లియాస్ పేరుగాంచింది. చల్లని గాలులు వీచినంత కాలం ఈ పుష్పాలు వికసిస్తూనే ఉంటాయి. ఈ మొకలు తోటలోని ఇతర మొకలతో సరిపోయేలా కూడా ఉంటాయి.
ఫ్లోక్స్..
శీతాకాలంలో పెరిగే మరొక పుష్ప జాతి మొక ఫ్లోక్స్. విస్తృత శ్రేణి రంగులతో ఇది మొక్కల తోటకి అద్భుతమైన ఆకర్షణను అందజేస్తుంది.
పాన్సీ..
పాన్సీ … మరో సాధారణ శీతాకాలపు పువ్వుగా పేర్కొంటుంటారు. ఇది దాదాపు అన్ని రంగుల షేడ్స్‌లో లభిస్తుంది. విభిన్న రంగుల కలయికను ఉపయోగించి పెంచుకోవచ్చు. పాన్సీలు తకువగా పెరిగే మొకలు కాబట్టి ఇవి నీడలో బాగా వృద్ధి చెందుతాయి.
స్వీట్ అలిసం..
ఈ పువ్వులు తేలికపాటి మంచును తట్టుకోగలవు. అవి ధృడంగా ఉండటం వల్ల వాటిని శీతాకాలం అంతా ఎటువంటి సంకోచం లేకుండా పెంచవచ్చు. ఇవి చూసేందుకు చిన్నవిగా ఉన్నా, తీపి సువాసనను కలిగి ఉంటాయి.
గాలి, వెలుతురు తప్పనిసరి
శీతాకాలంలో పూల మొకలకు నీరు పోయడంతో పాటు గాలి, వెలుతురు వచ్చేలా ఉంచాలి. ఒక్కో మొక్కకు 2 నుంచి 3 అడుగుల దూరం పాటించాలి. కొన్ని ఎత్తుగా పెరిగే పూలమొక్కలకు 3 కంటే ఎక్కువ అడుగుల దూరాన్ని పాటించాలి. మొక్కలకు క్రమం తప్పకుండా సేంద్రియ ఎరువు అందించాల్సి ఉంటుంది.
– సంరెడ్డి మౌనిక, సిటీ టెర్రాస్ గార్డెన్ సభ్యురాలు
పాట్ మారీ గోల్డ్..
కాలెంన్డ్యులా అని పిలుస్తారు. సాధారణంగా దీనిని ‘పాట్ మారీ గోల్డ్’ అని వ్యవహరిస్తారు. కుండలు, ప్లాంటర్స్లో బాగా పెరుగుతాయి. ఇవి అత్యంత సాధారణమైన శీతాకాలపు పువ్వులుగా ఉంటాయి. వీటిని నిర్వహణ కూడా సులభంగానే ఉంటుంది. పసుపు, నారింజ వివిధ రంగుల్లో ఈ పూలు పూస్తుంటాయి.
వింటర్ హనీసకిల్..
వింటర్ హనీసకిల్ పువ్వులు నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు వికసిస్తాయి. ఈ మొక క్రిమీ వైట్ పువ్వులను ఉత్పత్తి చేస్తుంది. ఇది నిమ్మరసం పోలిన సువాసనను విడుదల చేస్తుంది.