కుత్బుల్లాపూర్,నవంబర్5 : రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త మార్పులతో నిర్మాణ రంగానికి చేయూతనిస్తున్నది. దీంతో హైదరాబాద్ నగరంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపార వేత్తలు పోటీపడుతున్నారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శనివారం కొంపల్లిలో ఆస్పియస్ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఉత్తర హైదరాబాద్(నార్త్ సిటీ)పై దృష్టి సారించేందుకు మొదటిసారిగా క్రెడాయ్(కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగే 12వ హైదరాబాద్ ప్రాపర్టీషోను నిర్వహించారు. ఈ షోను మంత్రితో పాటు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌లు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మట్లాడుతూ..హైదరాబాద్ నగరాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్‌తో పాటు పురపాలక,ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌లు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. యావత్ దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దేలా హైదరాబాద్ నగరంలో సకల సౌకర్యాలు కల్పించేందుకు కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వం హైదరాబాద్‌తో సమానంగా ఉత్తర కారిడార్‌లో కండ్లకొయ వద్ద అతిపొడవైన ఐటీ టవర్‌ను నిర్మించబోతున్నదని చెప్పారు. మొదటి దశలో 100 కంపెనీలు ఇక్కడ ఏర్పాటు చేయడం ద్వారా 50 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా తగు చర్యలు జరుగుతున్నాయని మంత్రి చెప్పారు.ఈ కార్యక్రమంలో క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు పి.రామకృష్ణారావు, కొంపల్లి మున్సిపాలిటీ చైర్మన్ సన్న శ్రీశైలంయాదవ్, పీర్జాదిగూడ మున్సిపల్ మేయర్ జక్క వెంకట్‌రెడ్డి, క్రెడాయ్ జనరల్ సెక్రటరీ వి.రాజశేఖర్‌రెడ్డి, తెలంగాణ చైర్మన్ సీహెచ్.రామచంద్రా రెడ్డి, అధ్యక్షుడు డి.మురళీకృష్ణారెడ్డి, హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ జి.ఆనంద్‌రెడ్డి, కె.రాజేశ్వర్‌రెడ్డి, జైదీప్‌రెడ్డి, బి.జగన్నాథరావు, కోశాధికారి ఆదిత్యగౌర, సహాయ కార్యదర్శులు శివరాజ్ఠాకూర్, కె.రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.