బడంగ్‌పేట, నవంబర్ 5 : సెల్‌ఫోన్ లేకుండా క్షణం ఉండలేని రోజులు ఇవి. పక్కన ఉన్న వారు ఏమైపోయినా పట్టించుకోని కాలం. నిత్యం సెల్ ఫోన్లో ఆటలు, పాటలు, షేరింగ్‌లు, చాటింగ్‌లతో నిమగ్నమై ఉండే యువతలో మార్పు మొదలైంది. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ వేసిన్నప్పటి నుంచి యువత సెల్ ఫోన్ వాడకం తగ్గించారు. రంగారెడ్డి జిల్లా గ్రంథాలయానికి ప్రతి రోజు 150 నుంచి 200 మంది యువకులు చదువుకోవడానికి వస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నిర్మాణం చేసిన జిల్లా గ్రంథాలయంలో చదువుకోవడానికి సకల సౌకర్యాలు ఉండటంతో చాలా మంది ఉదయం 8గంటలకే గ్రంథాలయానికి వస్తున్నారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 గంగల వరకు యువత సెల్ ఫోన్ పక్కకు పెట్టి పుస్తకాల పురుగులవుతున్నారు. రోజుకు 10 నుంచి 12 గంటల వరకు చదువుకుంటున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. సెల్ ఫోన్లో ఎక్కువ సేపు చదువుకోవడానికి అవకాశం ఉండదంటున్నారు. పుస్తకాలలో సమగ్రమైన సమాచారం ఉంటుందని యువత పేర్కొంటున్నారు. సెల్ ఫోన్లో చదువుకోవడానికి అన్ని వాస్తవాలు అని చెప్పలేమంటున్నారు. యూట్యూబ్, గూగుల్‌లో పూర్తి స్థాయి సమాచారం ఉంటుందనడానికి పూర్తి స్థాయి ఆధారాలు ఉండవు, కనుక పుస్తకాలను చదువుకోవడంతో మంచి ఫలితాలు వస్తాయన్న నమ్మకం ఉందని, పుస్తకాలపై ఎక్కువ మంది ఆధార పడుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం అవసరమే కాన్ని పూర్తిగా సెల్ ఫోన్ మీద ఆధార పడితే ఉద్యోగం సంపాధించలేమని యువత చెప్తున్నారు.
సెల్ ఫోన్ వాడకం తగ్గించిన యువత
గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్నాం కనుకనే సెల్ ఫోన్ వాడకం తగ్గించామని యువత చెబుతున్నారు. ఒక్క క్షణం కూడా సెల్ ఫోన్ లేకుండా ఉండలేని యువత జీవితంలో కష్ట పడి చదువుకొని ఉద్యోగం సాధించాలంటే.. సెల్ ఫోన్‌కు దూరంగా ఉండాలని భావిస్తున్నారు. దీంతో గ్రంథాలయంలో చదువుకోవడానికి వచ్చి సెల్ ఫోన్లను స్విచ్ఛాప్ చేస్తున్నారు. జీవితాలు చక్కదిద్దుకోవడానికి సెల్ ఫోన్ పక్కకు పెట్టి, పుస్తకాలు చదవడంతో మంచి ఫలితాలు వస్తాయని యువత విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. పుస్తకమే ప్రపంచంగా నిమగ్నమై చదువుతున్నారు. పుస్తక ప్రపంచంలోకి అడుగు పెట్టి గంటల తరబడి చదువుతున్నారు. సెల్ ఫోన్లో చదివిన దానికి పుస్తకంలో చదివిన దానికి చాలా వ్యత్యాసం ఉంటుందని నిరుద్యోగులు నమ్ముతున్నారు. ఉదయం 8 నుంచి రాత్రి 8గంటల వరకు గ్రంథాలయంలో చదువుకుంటున్నారు. సమయం అయిపోయిందని బెల్ మోగితే తప్ప యువత పుస్తకాలు వదలడం లేదు. యువతతో పాటు చాలా మంది కథలు, న్యూస్ పేపర్, మాస పత్రికలు గంటల తరబడి చదువుకుంటున్నారు. సెల్ ఫోన్లో చదవటంతో అనారోగ్యం పాలవుతామని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పుస్తకాలు చదువటంతో అలసట ఉండదంటున్నారు. నెలల తరబడి యువత సెల్ ఫోన్‌కు దూరం అవుతున్నారు. పుస్తకాలు చదవడంతో ప్రయోజనం ఉంటుందని పాఠకులు పేర్కొంటున్నారు. పుస్తకాలు చదివితే ఏకాగ్రత పెరుగుతుందంటున్నారు.
పుస్తకాల ద్వారానే ఎక్కువ ప్రయోజనం
పుస్తకాల ద్వారానే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. 2021 నుంచి గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్నా.. ఎలాగైనా జాబ్ సాధించాలని.. రోజుకు 9గంటలు చదువుతున్న. పుస్తకాలను చదవడానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నాం. సెల్ ఫోన్ సమాచారం కోసం మాత్రమే చూసుకుంటున్నాను. గ్రంథాలయంలో ఉన్నంత సేపు ఫోన్లు మాట్లాడటం లేదు. సెల్ ఫోన్‌తో సమయం వృథా అవుతుంది. సెల్ ఫోన్లో ఎక్కువ సేపు చదువుకోలేం. కండ్లు మంటలేవడం. నిద్ర రావడం వంటి సమస్యలు వస్తున్నాయి. పుస్తకమే అన్నింటికి మూలధారం. – లోకేశ్ మీర్‌పేట
పుస్తకాల్లో సంక్షిప్త సమాచారం
పుస్తకాల్లో సమగ్ర సమాచారం ఉంటుంది. సెల్ ఫోన్లో వాస్తవాలు, అవస్తవాలు కూడా ఉంటాయి. యూట్యూబ్‌లో తప్పుడు సమాచారం కూడా పెడుతున్నారు. నియంత్రంణ లేకుండా పోయింది. దీంతో సమస్యలు వస్తున్నాయి. అందుకనే సెల్ ఫోన్ వాడకం తగ్గించాం. ప్రతి రోజు 10 నుంచి 12 గంటలు చదువుతున్నాను. పుస్తకాల్లో అవసరమైన సమాచారం ఉంటుంది. ఎక్కువ సేపు చదువుకోవడానికి వీలుంటుంది. సెల్ఫోన్లో ఎక్కువ సేపు చదువుకోలేం. మూడేండ్లుగా గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్నాను. ఏకాగ్రత పెరుగుతుంది. పుస్తకం చదవడంతో మంచి ఫలితాలు వస్తాయి. సాంకేతిక పరిజ్ఞానం అవసరమే అయినా పూర్తి స్థాయిలో సెల్ మీద ఉపయోగ పడటం లేదు. – రమావత్ కోటేశ్