సికింద్రాబాద్, నవంబర్ 5: ప్రభుత్వం మరోమారు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో అభివృద్ధికి కట్టుబడి ఉన్నామనే సంకేతాలు ఇచ్చింది. కేంద్ర సర్కారు బోర్డుకు రావాల్సిన బకాయిలను విడుదల చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రాజీలేకుండా ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ (టీపీటీ) నిధులను విడుదల చేస్తూ బోర్డు అభివృద్ధికి సహకరిస్తుంది. ఈ క్రమంలో బోర్డుకు పెండింగ్లో ఉన్న నిధులను విడతల వారీగా చెల్లిస్తుంది. దీంట్లో భాగంగా గత నెల 11వ తేదీన రూ. 6కోట్లు విడుదల చేయగా, తాజాగా శనివారం ఏకంగా రూ.17కోట్లను బోర్డు ఖాతాలో జమ చేసింది. కానీ రక్షణ శాఖ నుంచి చెల్లించాల్సిన సర్వీ స్ చార్జీల బకాయి నిధులను మాత్రం బీజేపీ ప్రభుత్వం విడుదల చేయకుండా తాత్సారం చేస్తుంది. దీంతో కంటోన్మెంట్ బోర్డుకు సర్వీస్ చార్జీల రూపేణ కేంద్రం సుమారు రూ.875 కోట్ల మేర బకాయి పడింది.
బకాయిలపై నోరుమెదపని బీజేపీ నేతలు…
కంటోన్మెంట్ బోర్డు పరిధిలో అంతా తామే అభివృద్ధి చేస్తున్నామంటూ ఊదరగొడుతున్న బీజేపీ నేతలకు బకాయిలు కనిపించడం లేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. వందల కోట్ల రూపాయిలు సర్వీస్ చార్జీల కింద రావాల్సి ఉన్నా కాషాయ నేతలు నోరు మెదపకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధికి సహకరిస్తున్న రాష్ట్ర సర్కారుపై మాత్రం నోరు పారేసుకునేందుకు నామినేటెడ్ సభ్యుడుతో పాటు మిగతా కాషాయ నేతలు బస్తీల్లో తిరుగుతూ సర్కారుపై మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించనట్లు ఉందని ఎద్దేవా చేస్తున్నారు. ఇప్పటికైనా దమ్ముంటే కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు విడుదల చేయించే విధంగా కృషి చేయాలని ప్రశ్నిస్తున్నారు.
బీజేపీ నేతలు కేంద్రం నుంచి నిధులు తేవాలి
రాష్ట్ర ప్రభుత్వంపై నోరు పారేసుకుంటున్న కమలం నేతలు కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలి. టీపీటీ నిధుల గురించి మాట్లాడే కాషాయ నేతలకు సర్వీ స్ చార్జీల గురి ంచి మాట్లాడే ధైర్యం లేదా.. ప్రభ్తుత్వం నుంచి రావాల్సిన నిధులతో పాటు ప్రత్యేక నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నాం.
– సాయన్న, ఎమ్మెల్యే